మణిపూర్‌లో కాల్పులు.. మరోసారి హై అలర్ట్‌

Jan 1,2024 15:04 #curfew, #gunfights, #Manipur violence

ఇంఫాల్‌ :    మణిపూర్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. సాయుధ దుండగులు మరియు పోలీస్‌ కమాండోస్‌ మధ్య జరిగిన కాల్పుల్లో ఓ కమాండోకి తీవ్ర గాయాలైనట్లు అధికారులు తెలిపారు. దీంతో మయన్మార్‌ సరిహద్దులోని మోరే జిల్లాలో మరోసారి కర్ఫ్యూ విధించినట్లు వెల్లడించారు. కుకీ కమ్యూనిటీకి చెందిన తెంగ్నౌపాల్‌లోనే మోరే జిల్లా కూడా ఉంది. మైతేయి కమ్యూనిటీ దాడుల్లో ఈ ప్రాంతం కూడా తీవ్రంగా ప్రభావితమైంది.

శనివారం మధ్యాహ్నం 3.45కి సాయుధ దుండగులు పోలీస్‌ కమాండోలపై కాల్పులు జరిపారని, సాయంత్రం 5.30 వరకు కాల్పులు కొనసాగాయని దీంతో జిల్లాలో హైఅలర్ట్‌ ప్రకటించినట్లు జిల్లా అధికారులు తెలిపారు. మోరేలో జరిగిన ఆకస్మిక దాడిలో 5వ ఇండియా రిజర్వ్‌ బెటాలియన్‌కు చెందిన ఓ రైఫిల్‌ మ్యాన్‌ జి.పొన్‌ఖమ్‌లుంగ్‌కి గాయాలయ్యాయని మణిపూర్‌ పోలీస్‌ అధికారి ఒకరు తెలిపారు. గాయపడిన కమాండోను అస్సాం రైఫిల్స్‌ క్యాంపుకు తరలించామని, మెరుగైన చికిత్స కోసం ఇంఫాల్‌లోని ఆస్పత్రిలో చేర్చినట్లు తెలిపారు. శనివారం అర్థరాత్రి తీవ్రవాదులు మోరేలోని పోలీస్‌ శిబిరాలపై గ్రెనేడ్‌లతో కాల్పులు జరిపారని ఆ అధికారి తెలిపారు. ఈ దాడిలో మరో నలుగురికి కమాండోలకు గాయాలయ్యాయని అన్నారు. ఆదివారం సాయంత్రం మళ్లీ కాల్పులు జరిగాయని, అయితే గాయాలు, మరణాలకు సంబంధించిన వివరాలు తెలియలేదని జిల్లా పోలీస్‌ అధికారి తెలిపారు.

పోలీసుల  నివేదికపై దేశీయ ట్రైబల్‌ లీడర్స్‌ ఫోరమ్‌ ఆగ్రహం వ్యక్త చేసింది. శనివారం కుకీ గ్రామంపై పోలీస్‌ కమాండోలు విచక్షణా రహితంగా కాల్పులు జరిపి, మూడు నివాసాలను తగులబెట్టారని తెలిపింది. పోలీసుల దాడిపై విచారణ జరిపించాలని మరో కమ్యూనిటీ కుకీ ఇన్‌పి, సాదర్‌ హిల్స్‌ డిమాండ్‌ చేసింది. మణిపూర్‌లో కొనసాగుతున్న హింసాత్మక పరిస్థితులపై ”ఫోరమ్‌ రిస్టోరేషన్‌ ఆఫ్‌ పీస్‌ ఇన్‌ మణిపూర్‌ ” ఆందోళన వ్యక్తం చేసింది. ఆ ప్రాంతంలో శాంతిని నెలకొల్పేందుకు, చర్చలకు మధ్యవర్తిత్వం వ్యవహరించేందుకు సయోధ్య, నిజ నిర్థారణ కమిటీని నియమించాలని డిమాండ్‌ చేస్తోంది.

గతేడాది మే 3న కుకీ మైతేయి కమ్యూనిటీల మధ్య చెలరేగిన ఘర్షణలు ఉద్రిక్త పరిస్థితులకు దారితీసిన సంగతి తెలిసిందే. అధికార మద్దతుతో మైతేయి కమ్యూనిటీ కుకీ గ్రామాలపై దాడులకు తెగబడింది. గత ఎనిమిది నెలలుగా జరిగిన ఈ హింసాకాండలో ఇప్పటివరకు సుమారు 200 మంది మరణించగా, 60,000 మందికి పైగా  నిరాశ్రయులయ్యారు.

➡️