కేజ్రీవాల్‌ అరెస్టును నిరసిస్తూ నేడు ఢిల్లీలో భారీ బహిరంగసభ

Mar 31,2024 10:48 #Big rally, #Delhi, #INDIA bloc

 హాజరుకానున్న ‘ఇండియా’ వేదిక అగ్రనేతలు రాహుల్‌, ఖర్గే, ఏచూరి

న్యూఢిల్లీ :   ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు మద్దతుగా, ప్రతిపక్ష పార్టీలపై కేంద్రం దాడులకు వ్యతిరేకంగా ఆదివారం భారీ బహిరంగసభ నిర్వహించేందుకు ‘ఇండియా’ వేదిక సిద్ధమైంది.  ఇక్కడి రామ్‌లీలా మైదానంలో నిర్వహించే ఈ సభకు కాంగ్రెస్‌ నేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌గాంధీ, సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సిపిఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, ఎన్‌సిపి (ఎస్‌పి) అధినేత శరద్‌పవార్‌, జార్ఖండ్‌ సిఎం చంపయీ సొరేన్‌, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన (యుబిటి) నేత ఉద్దవ్‌ థాకరే, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలరేష్‌ యాదవ్‌, బీహార్‌ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆర్‌జెడి నేత తేజస్వీ యాదవ్‌, డిఎంకె నాయకుడు తిరుచ్చి శివ, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నాయకుడు ఫరూఖ్‌ అబ్దుల్లా, పిడిపి చీఫ్‌ మెహబూబా ముఫ్తీ, టిఎంసి నేత డెరెక్‌ ఓబ్రెయిన్‌ హాజరవుతారని కాంగ్రెస్‌ నాయకులు జైరామ్‌ రమేష్‌ తెలిపారు.

రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకే నేడు ర్యాలీ : కాంగ్రెస్‌
ఆదివారం ‘ఇండియా’ వేదిక నిర్వహించనున్న ర్యాలీ ఒక వ్యక్తిని రక్షించడం కోసం కాదని, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించడం కోసమని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరామ్‌ రమేష్‌ తెలిపారు. శనివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధాని నివాసం ఉన్న లోక్‌ కల్యాణ్‌ మార్గ్‌ వరకూ నిర్వహించనున్న ఈ ర్యాలీ బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వం ‘సమయం ముగిసింది’ అని బలమైన సందేశం ఇస్తుందని తెలిపారు. ఇది వేదికలో సంఘీభావాన్ని, ఐక్యతను తెలియజేస్తుందని చెప్పారు. కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగం ద్వారా ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకోవడం మరో కీలకమైన అంశమని చెప్పారు. రాజకీయంగా ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకునేందుకే ఇద్దరు సిఎంలు, పలువురు మంత్రులను అరెస్టు చేశారని అన్నారు. శుక్రవారం కాంగ్రెస్‌ పార్టీకి మరో రెండు ఆదాయపు పన్ను శాఖ నోటీసులు వచ్చాయని చెప్పారు.

➡️