ప్రజ్వల్‌ రేవణ్ణకు విదేశాంగ శాఖ షోకాజ్‌ నోటీస్‌

న్యూఢిల్లీ : జెడిఎస్‌ ఎంపి ప్రజ్వల్‌ రేవణ్ణకు కేంద్ర విదేశాంగ శాఖ శుక్రవారం షోకాజ్‌ నోటీసు జారీ చేసింది. లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నందున దౌత్య పాస్‌పోర్టు ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు కర్ణాటక ప్రభుత్వం చేసిన విజ్ఞప్తికి స్పందనగా విదేశాంగ శాఖ ఈ నోటీసులు జారీ చేసింది. ప్రజ్వల్‌ రేవణ్ణ ప్రస్తుతం జర్మనీలో ఉన్నట్లు భావిస్తున్నారు. రేవణ్ణ దౌత్య పాస్‌పోర్టును రద్దు చేసే ప్రక్రియలో భాగంగానే ఆయనకు షోకాజ్‌ నోటీసు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. ఈమెయిల్‌ ద్వారా షోకాజ్‌ నోటీసు జారీ చేసినట్లు తెలిపారు. ఈ దౌత్య పాస్‌పోర్టును రద్దు చేస్తే ప్రజ్వల్‌ విదేశాల్లో ఉండటం చట్టవిరుద్ధమవుతుంది. అలాగే తను ఉంటున్న దేశంలో చట్టపరమైన చర్యలను ప్రజ్వల్‌ ఎదుర్కొవలసి ఉంటుందని అధికారులు తెలిపారు. ప్రజ్వల్‌ తాత, మాజీ ప్రధాని దేవెగౌడే అతడిని విదేశాలకు పంపించినట్లు కనిపిస్తోందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విమర్శించారు. ప్రజ్వల్‌ను లొంగిపోవాలని హెచ్చరిస్తూ దేవెగౌడ చేసిన ప్రకటనపై స్పందిస్తూ సిద్ధరామయ్య ఈ వ్యాఖ్యలు చేశారు.

➡️