ఓట్ల లెక్కింపు తేదీని మార్చండి : మిజోరాం ఎన్‌జిఒ కోఆర్డినేషన్‌ కమిటీ

Nov 25,2023 08:59 #counting, #Mizoram

 ఐజ్వాల్‌  :  మిజోరాం ఎన్‌జిఒ కోఆర్డినేషన్‌ కమిటీ (ఎన్‌జిఒసిసి) ప్రతినిధి బృందం అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు షెడ్యూల్‌ను రీ షెడ్యూల్‌ చేయాలని కోరుతోంది. ఈ మేరకు ఎన్నికల కమిషన్‌కు విజ్ఞప్తి చేసేందుకు శుక్రవారం ఢిల్లీకి వెళ్లనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన మిజోరాం, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలతో పాటు ఎన్నికలు జరగనున్న రాజస్థాన్‌ తెలంగాణ రాష్ట్రాలకు ఓట్ల లెక్కింపును డిసెంబర్‌ 3వ తేదీన చేపట్టనున్నట్లు ఇసి ప్రకటించిన సంగతి తెలిసిందే. డిసెంబర్‌ 3 ఆదివారం కావడంతో.. క్రైస్తవుల మెజారిటీ అధికంగా ఉన్న రాష్ట్రం కావడంతో చర్చి కార్యక్రమాలతో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని ఎన్‌జిఒసిసి పేర్కొంది. దీంతో ఓట్ల లెక్కింపు తేదీని డిసెంబర్‌ 3 కాకుండా డిసెంబర్‌ 4 లేదా 5వ తేదీకి మార్చాలని కోరుతున్నట్లు తెలిపింది. 2011 జనాభా లెక్కల ప్రకారం.. మిజోరాంలో జనాభాలో క్రైస్తవులు 87 శాతం ఉన్నారు.

ఎన్‌జిఒసిసికి చెందిన ఆరుగురు సభ్యుల ప్రతినిధి బృందం ఢిల్లీకి బయలుదేరనున్నట్లు సమాచారం. అయితే ఇసి అధికారితో అపాయింట్‌మెంట్‌ లేదని ఆ వర్గాలు పేర్కొన్నాయి. అపాయింట్‌మెంట్‌ లేనప్పటికీ .. ఢిల్లీ చేరుకుని అధికారులను కలిసేందుకు ప్రయత్నించాల్సిందిగా ఉన్నతాధికారులు సలహా ఇచ్చారని సెంట్రల్‌ యంగ్‌ మిజో అసోసియేషన్‌ (సివైఎంఎ) ప్రధాన కార్యదర్శి మల్సావ్మియానా తెలిపారు. ఎన్‌జిఒసిసిలో సివైఎంఎ కూడా ఓ భాగం కాగా, ఢిల్లీకి వెళ్లే ఆరుగురు ప్రతినిధుల బృందంలో మల్సావ్మియానా కూడా ఉన్నారు. ఇసి అధికారులతో సమావేశమయ్యే అవకాశం ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

అధికార మిజో నేషనల్‌ ఫ్రంట్‌ (ఎంఎన్‌ఎఫ్‌) మరియు బిజెపి, చర్చి మరియు విద్యార్థి సంఘాలతో సహా రాజకీయ పార్టీలు కౌంటింగ్‌ తేదీని రీ షెడ్యూల్‌ చేయాలని ఎన్నికల ప్యానెల్‌ను కోరుతూ ఇసికి లేఖలు రాశాయి. ఎన్‌జిఒసిసి కూడా లేఖ రాసినట్లు సమాచారం. అయితే కౌంటింగ్‌లో సాధారణ ప్రజలు పాల్గనే అవకాశం ఉండదని ఇసి వాదిస్తోంది.

➡️