నేటితో ముగియనున్న ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్‌ రిమాండ్‌..

ఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం సఅష్టించిన ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఇరుక్కున్న కవిత బయటకు వచ్చేలా కనిపించడం లేదు. కవితకు ముందు ముందు కష్టాలు తప్పేలా కనిపించడం లేదు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సీబీఐ కేసులో తీహార్‌ జైలులో ఉన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్‌ కస్టడీ నేటితో ముగియనుంది. ఇవాళ తీహార్‌ జైలు అధికారులు కవితను ట్రయల్‌ కోర్టులో హాజరు పర్చనున్నారు. మార్చి 15 న ఈడీ లిక్కర్‌ కేసులో కవిత ను అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం జ్యుడీషియల్‌ రిమాండ్‌ లో భాగంగా కవిత తీహార్‌ జైల్లో ఉన్నారు.
ఢిల్లీ మద్యం కుంభకోణంలో మనీలాండరింగ్‌ ఆరోపణలపై ఈ ఏడాది మార్చి 15న కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు అరెస్ట్‌ చేశారు. అనంతరం కవితను కోర్టులో హాజరుపరచగా, కవితకు జ్యుడిషియల్‌ రిమాండ్‌ విధించారు. అప్పటి నుంచి ఈ కేసులో బెయిల్‌ కోసం కవిత ప్రయత్నించి విఫలమైంది. మరోవైపు కవితపై ఈడీ కేసులతో పాటు సీబీఐ కూడా అవినీతి ఆరోపణలపై కేసు నమోదు చేసింది. దీంతో కవిత ఈడీ కేసు, సీబీఐ కేసులను ఎదుర్కోనున్నారు. బెయిల్‌ కోసం కోర్టు దరఖాస్తు చేసుకున్న ప్రతిసారీ ఈడీ, సీబీఐలు గట్టి వాదనలు వినిపించి కవితకు బెయిల్‌ రాకుండా అడ్డుకున్నారు. కోర్టులో వాదనలు వినిపించిన ప్రతిసారీ ఈడీ, సీబీఐ దాఖలు చేసిన చార్జిషీటులో కవిత పాత్రపై కీలక విషయాలు వెల్లడవుతున్నాయి.

➡️