Andaman and Nicobar : నిరుద్యోగ సమస్య పరిష్కరించడంలో మోడీ ప్రభుత్వం విఫలం

పోర్ట్‌ బ్లెయిర్‌ : అండమాన్‌ నికోబర్‌ దీవుల్లో పెరుగుతున్న నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో మోడీ ప్రభుత్వం విఫలమైందని సిపిఎం అభ్యర్థి డి. అయ్యప్పన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో పోలిస్తే నిరుద్యోగ సమస్య అధికమైందని అన్నారు. సిపిఎం అభ్యర్థి డి. అయ్యప్పన్‌ను గెలిపించాలంటూ ఈ నెల 24న షాహీద్‌ భవన్‌లో ఎన్నికల సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి. లక్ష్మణ్‌ అధ్యక్షత వహించారు.

దేశం నిరంకుశత్వం దిశగా పయనిస్తోందని సిపిఎం మాజీ కేంద్ర కార్యదర్శి కె.జిదాస్‌ పేర్కొన్నారు. దేశ ప్రజలకు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు కేంద్రం హరిస్తోందని ధ్వజమెత్తారు. ఈ ప్రాంత ప్రజల్లో అసంతృప్తి పెరిగిపోయిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి. లక్ష్మణ్‌ పేర్కొన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో బిజెపి, కాంగ్రెస్‌ రెండు పార్టీలు ఘోరంగా విఫలమయ్యాయని అన్నారు.

అనంతరం సిపిఎం పార్లమెంటు అభ్యర్థి అయ్యప్పన్‌ మాట్లాడుతూ.. మోడీ రాజ్‌ హయాంలో ప్రజల డిమాండ్లు ఇప్పటికీ నెరవేరలేదని అన్నారు. విద్యుత్‌ సరఫరాలో అంతరాయాన్ని సూచిస్తూ.. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఇప్పటికీ సమస్యను పరిష్కరించేందుకు తగిన చర్యలు చేపట్టలేదని మండిపడ్డారు. మోడీ రాజ్‌ హయాంలో ద్వీప ప్రాంతంలో అవినీతి పెరిగిపోయిందని, రానున్న రోజుల్లో అవినీతికి వ్యతిరేకంగా పోరాటాన్ని సిపిఎం కొనసాగిస్తుందని హామీ ఇచ్చారు. దీవుల్లో జనాభా పెరుగదలను అరికట్టాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు. ఇక్కడి అభ్యర్థులకు పూర్తి ప్రభుత్వ ఉద్యోగాల కల్పనకు హామీ ఇవ్వాలని పునరుద్ఘాటించారు.

గతంలో ఈ ప్రాంతంలో రైతులు పొందే పలు ప్రయోజనాలను మోడీ ప్రభుత్వం దోచుకుందని ఆల్‌ ఇండియా కిసాన్‌ సభ రాష్ట్ర కార్యదర్శి డా.గౌరాంగా మజ్హి విమర్శించారు. సిఐటియు రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు ఆర్‌.సురేంద్రన్‌ పిళ్లై, రాష్ట్ర కార్యదర్శి సి. ఆనంది, ఐద్వా ఉపాధ్యక్షురాలు, డివైఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ రిను ఆంటోనీ తదితరులు హాజరయ్యారు.    కన్వీనర్‌గా ప్రణోబ్‌ బెనర్జీని  125 మంది సభ్యుల ఎన్నికల  సదస్సు ఎన్నుకుంది.    పార్టీ కార్యకర్తలు,  మద్దతుదారు, సానుభూతిపరులు హాజరై ఈ సదస్సుని విజయవంతం చేశారు.

కేంద్రపాలిత ప్రాంతమైన అండమాన్‌ నికోబర్‌ దీవిలోని ఒకేఒక పార్లమెంటు స్థానానికి సిపిఎం నుండి డి. అయ్యప్పన్‌ బరిలో నిలిచారు. ఏప్రిల్‌ 19న ఒకే దశలో పోలింగ్‌ జరగనుంది.

➡️