‘చండీగఢ్‌’పై పెదవి విప్పని మోడీ

Feb 9,2024 11:50 #Chandigarh, #modi
  • సుప్రీం తీవ్ర వ్యాఖ్యల తర్వాత కూడా మౌనం

చండీగఢ్‌ : ఇటీవల జరిగిన చండీగఢ్‌ మేయర్‌ ఎన్నికపై సుప్రీంకోర్టు తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. దేశంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని మండిపడింది. కానీ మన ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం ఈ వ్యవహారంతో తనకేమీ సంబంధం లేదన్న విధంగా మౌనం వహించారు. ఇప్పుడు ఆయన స్పందన కోసం దేశమంతా ఎదురు చూస్తోంది. దేశంలో ఎన్నికలు జరుగుతాయి కానీ పాలకులే విజేతలవుతారని చండీఘర్‌ మేయర్‌ ఎన్నిక నిరూపించింది.

చండీగఢ్‌ మేయర్‌ ఎన్నిక కోసం రిటర్నింగ్‌ అధకారిగా వ్యవహరించిన అనిల్‌ మసిహ్ ఎవరో తెలుసా? ఆయన అక్కడ బిజెపి మైనారిటీ విభాగం ఇన్‌ఛార్జిగా కూడా పనిచేస్తున్నారు. ఇక ఆ ఎన్నిక ఎంత పారదర్శకంగా, నిస్పాక్షికంగా జరుగుతుందో ఊహించడం కష్టమేమీ కాదు కదా. మసిహ్ నిర్వాకాన్ని ఎబీసీ ఛానల్‌ బట్టబయలు చేసింది. సిసిటివి కెమేరాలను ఆపేశారని భావించిన మసిహ్ ఓట్ల లెక్కింపులో అక్రమానికి పాల్పడుతూ అడ్డంగా దొరికిపోయాడు. ఆయన చేసిన పనేమిటంటే… ఎనిమిది బ్యాలెట్‌ పత్రాలపై రిమార్క్‌ రాసి, వాటిని పక్కనే ఉన్న ఓ ట్రేలో పడేశాడు. విశేషమేమంటే ఈ ఓట్లన్నీ ఆప్‌, కాంగ్రెస్‌ కూటమి అభ్యర్థికి పడినవే. వీటిని చెల్లనివిగా మసిహ్ ప్రకటించడంతో బిజెపి అభ్యర్థి మేయర్‌గా ఎన్నికయ్యారు.

ఈ వ్యవహారం చివరికి సుప్రీంకోర్టుకు చేరింది. ఓట్ల లెక్కింపునకు సంబంధించిన వీడియోను తిలకించిన ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్‌ తీవ్రంగా స్పందించారు. ప్రజాస్వామ్యం అపహాస్యం పాలైందని, ఖూనీ అయిందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రిసైడింగ్‌ అధికారిపై విచారణ జరుపుతామని స్పష్టం చేశారు. మసిహ్ తనకు తానుగా ఇలా వ్యవహరించాడా లేక ఎవరన్నా అలా చేయమని ఆదేశించారా అన్నది తెలియడం లేదు. స్వేచ్ఛగా, నిస్పక్షపాతంగా ఎన్నికలు జరగాలని కోరుకుంటున్న దేశ పౌరులందరూ చండీగఢ్‌ ఉదంతంపై ప్రధాని పెదవి విప్పాలని ఆశిస్తున్నారు. ముఖ్యంగా సుప్రీంకోర్టు చేసిన తీవ్రమైన వ్యాఖ్యల తర్వాత అయినా ఆయన దీనిపై మాట్లాడాల్సిన అవసరం ఉన్నదని వారు అభిప్రాయపడుతున్నారు. మరో మూడు నెలల్లో దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. తాను మరోసారి అధికారంలోకి వస్తానని, హ్యాట్రిక్‌ సాధించడం ఖాయమని మోడీ పదేపదే చెబుతున్నారు. కానీ చండీఘర్‌ ఉదంతాన్ని చూసిన వారికి ప్రధాని ప్రకటనపై అనేక అనుమానాలు కలగడం సహజం.

బీహార్‌లో ఇండియా కూటమి నుండి నితీష్‌ కుమార్‌ వైదొలగడం వల్ల బిజెపి కూటమికి నష్టమే తప్ప ప్రయోజనమేమీ ఉండబోదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. జార్ఖండ్‌లో కూడా కాంగ్రెస్‌, జేఎంఎం కూటమి మెజారిటీ పార్లమెంటరీ స్థానాలు గెలుచుకోవడం తథ్యమని వార్తలు వస్తున్నాయి. జార్ఖండ్‌లో రాహుల్‌ యాత్రకు ఘన స్వాగతం లభించింది. అక్కడి ఆదివాసీలు బిజెపిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అనేక ఇతర రాష్ట్రాల్లో సైతం బిజెపికి ఎదురు గాలి వీస్తోంది. ఇలాంటి ప్రతికూల వాతావరణం మధ్య హ్యాట్రిక్‌ విజయంపై మోడీ ధీమా వ్యక్తం చేయడంపై అనుమానాలు కలగడం సహజమే.

➡️