మోడీని గద్దె దింపాలి.. అప్పుడే దేశానికి, ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి రక్ష : జంతర్‌ మంతర్‌ వద్ద ప్రతిపక్షాల నిరసనలో వక్తలు

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడాలంటే కేంద్రంలో మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిందే నని జంతర్‌ మంతర్‌ వద్ద జరిగిన ర్యాలీలో వక్తలు పిలుపునిచ్చారు. పార్లమెంటు చరిత్రలో కని విని ఎరుగని విధంగా 146 మంది ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్‌ చేసిన మోడీ ప్రభుత్వ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ‘ఇండియా’ ఫోరమ్‌ దేశ వ్యాపిత నిరసనలకు ఇచ్చిన పిలుపులో భాగంగా శుక్రవారం ఢిల్లీలో జంతర్‌మంతర్‌ వద్ద ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీనుద్దేశించి సిపిఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మాట్లాడుతూ, ప్రతిపక్ష ఎంపీలను మూకుమ్మడిగా బహిష్కరించడం ద్వారా పార్లమెంటులో ప్రజాస్వామ్యాన్ని మోడీ ప్రభుత్వం ఖూనీ చేసిందన్నారు. 146 మంది ఎంపీలను సెస్పెండ్‌ చేయడం పార్లమెంటు చరిత్రలో ఎన్నడైనా విన్నామా అని ఆయన అన్నారు. బిజెపి మళ్లీ గెలిస్తే పార్లమెంటు ఉంటుందా అన్న సందేహం కలుగుతుందన్నారు. ప్రజలు ఎన్నుకున్న పార్లమెంటుకు ప్రభుత్వం జవాబుదారీగా ఉండాలని రాజ్యాంగం స్పష్టంగా పేర్కొంది. దీనికి భిన్నంగా బిజెపి ప్రభుత్వం ఎంపీలను బహిష్కరిస్తున్నది. పార్లమెంటును మూసివేస్తున్నది. రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తోందని ఏచూరి తీవ్రంగా ధ్వజమెత్తారు. . బిజెపి ప్రభుత్వ నిరంకుశ చర్యకు వ్యతిరేకంగా దేశ వ్యాపితంగా నిరసనలు వెల్లువెత్తాయి. సిపిఐ(ఎం), ఇతర వామపక్షాలు అన్ని చోట్లా ఈ నిరసనల్లో పాల్గొన్నాయి. కొల్‌కతాలో , లక్నోలో జరిగిన సభలో పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు సుభాషిణి ఆలీ పాల్గొన్నారు. విజయవాడ, హైదరబాద్‌లోనూ నిరసన ప్రదర్శనలు జరిగాయి. జార్ఖండ్‌లోని దేవగఢ్‌లో జరిగిన నిరసన ర్యాలీలో సిపిఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకరత్‌ పాల్గొన్నారు.

ఢిల్లీలో జరిగిన ర్యాలీలో కాంగ్రెస్‌ అద్యక్షుడు మల్లికార్జున ఖర్గే , ఆ పార్టీ నాయకుడు రాహుల్‌ గాంధీ సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ఎన్సీపి అధ్యక్షుడు శరద్‌ పవార్‌, సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా, లోక్‌సభ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు అధీóర్‌ రాజన్‌ చౌదరి, డిఎంకె నేత తిరుచ్చి శివ, సిపిఐఎంఎల్‌ నేత భట్టాచార్య, జెఎంఎం నేత మహువా మాంఝీ, ఆప్‌ ఎంపి సుశీల్‌ కుమార్‌ రింకు ఇతర ముఖ్య నేతలు పాల్గొని బిజెపిని నిశితంగా విమర్శించారు. ప్రతిపక్ష ఎంపిలను బహిష్కరించి 60 శాతం ప్రజల గొంతును మోడీ నొక్కేశారని అన్నారు. బిజెపి ద్వేషాన్ని వ్యాప్తి చేస్తుంటే, ‘ఇండియా’ ఫోరం ప్రేమ, సౌభ్రాతృత్వాన్ని చాటుతుందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఎంతటి మూల్యం చెల్లించడానికైనా సిద్ధమని ఎన్సిపి అధినేత శరద్‌ పవార్‌ అన్నారు.

➡️