బిభవ్‌ కుమార్‌కు జాతీయ మహిళా కమిషన్‌ సమన్లు

ఢిల్లీ : ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అధికారిక నివాసంలో ఆప్‌ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడి ఘటన తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో స్వాతి మలివాల్‌పై వేధింపులకు పాల్పడిన కేజ్రీవాల్‌ పీఎస్‌ బిభవ్‌ కుమార్‌కు జాతీయ మహిళా కమిషన్‌ తాజాగా సమన్లు పంపింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు మహిళా కమిషన్‌ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది.
లోక్‌సభ ఎన్నికల వేళ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ అధికారిక నివాసంలో ఆప్‌ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌కు ఎదురైన చేదు అనుభవం ఆ పార్టీని తీవ్రంగా కుదిపేసిన విషయం తెలిసిందే. స్వాతి మలివాల్‌ పట్ల కేజ్రీవాల్‌ పీఎస్‌ బిభవ్‌ కుమార్‌ అనుచితంగా ప్రవర్తించి, దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై ఆప్‌ తీవ్రంగా స్పందించింది. ఈ దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు బిభవ్‌ కుమార్‌పై కఠిన చర్య తీసుకుంటామని ఆప్‌ నేత సంజయ్ సింగ్‌ ప్రకటించారు. ‘స్వాతి మలివాల్‌ సోమవారం సీఎం కేజ్రీవాల్‌ను కలుసుకునేందుకు ఆయన అధికారిక నివాసానికి వెళ్లారు. డ్రాయింగ్‌ గదిలో సీఎం కోసం ఎదురుచూస్తుండగా, ఆమెతో పీఎస్‌ బిభవ్‌కుమార్‌ అనుచితంగా ప్రవర్తించాడు. ఈ విషయం కేజ్రీవాల్‌కు తెలిసింది. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోనున్నారు’ అని ఆయన తెలిపారు.

➡️