Kejriwal : కేజ్రీవాల్‌ అరెస్టుకు వ్యతిరేకంగా దేశవ్యాపిత నిరసనలు

26న మోడీ నివాసం వద్ద ఘెరావ్‌
బిజెపి కార్యాలయాల ఎదుట ఆందోళన
ఆప్‌ పిలుపు
సిపిఎం మద్దతు
ఇసికి ఇండియా ఫోరం నేతల ఫిర్యాదు
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద కేజ్రీవాల్‌పై తప్పుడు కేసు బనాయించి అరెస్టు చేయడాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాపిత నిరసనలకు ఆమాద్మీ పార్టీ (ఆప్‌) పిలుపునిచ్చింది. ఆరెస్టుకు నిరసనగా ఈ నెల26న ప్రధాని నివాసానికి మార్చ్‌ నిర్వహించాలని, దేశవ్యాపితంగా బిజెపి కార్యాలయాల ఎదుట నిరసనలు తెలపాలని, వీటిలో ప్రజాతంత్రవాదులంతా పాల్గనాలని ఆప్‌ విజ్ఞప్తి చేసింది. ఇప్పటికే ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా ఆప్‌ నేతలు ఆందోళనలకు దిగారు.. పార్టీ నేతలు, కార్యకర్తలు ఢిల్లీలో ఉదయం నుంచి రోడ్లపైకి వచ్చి బిజెపికి వ్యతిరేకంగా బిగ్గరగా నినదించారు. ఐటిఓ కూడలి, డిడియు మార్గ్‌లోని ఆప్‌, బిజెపి ప్రధాన కార్యాలయం, ఇతర ప్రదేశాలు నిరసనలతో దద్దరిల్లాయి.. నిరసనకారులను పోలీసులు చెదరగొట్టారు. మంత్రులు అతిషీ, సౌరభ్‌తో సహా పలువురు కార్యకర్తలు, నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. నిరసనలు, ఆందోళనలతో ఢిల్లీలో ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. నిరసనల నేపథ్యంలో బిజెపి ప్రధాన కార్యాలయం, ఇడి కార్యాలయానికి వెళ్లే మార్గాలను అధికారులు మూసివేశారు. 144 సెక్షన్‌ విధించారు. ఢిల్లీలోని ఐటిఓ మెట్రో స్టేషన్‌ను శుక్రవారం సాయంత్రం వరకూ మూసివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఆప్‌ నాయకుడు, ఢిల్లీ మంత్రి గోపాల్‌ రారు శుక్రవారం నాడిక్కడ మాట్లాడుతూ, బిజెపి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని, నియంతృత్వాన్ని దేశంపై రుద్దుతోందని విమర్శించారు. మొదట తప్పుడు కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రిని అరెస్ట్‌ చేశారు. ఇప్పుడు శాంతియుతంగా ఆందోళన చేపడుతున్న వారిని కూడా అరెస్ట్‌ చేస్తున్నారని మరో మంత్రి అతిషి విమర్శించారు. కేజ్రీవాల్‌ అరెస్టుపై గురువారం ముంబయిలోని ఇడి కార్యాలయం ఎదుట ఆప్‌ నిరసన తెలిపింది.
ఇసికి ఇండియా ఫోరం నేతల ఫిర్యాదు
ఇండియా ఫోరం నేతలు శుక్రవారం ఎన్నికల సంఘాన్ని కలిసి ఎన్నికల సమయంలో కేంద్ర సంస్థల దుర్వినియోగంపై ఓ వినతి పత్రాన్ని సమర్పించారు. ఎన్నికలను నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సోదాహరణంగా వారు ఆ మెమోరాండంలో వివరించారు. ”వివిధ రాష్ట్రాల చీఫ్‌ సెక్రటరీ, హౌం సెక్రటరీ, డిజిపి సహా ఉన్నతాధికారులను నియంత్రించే, మార్చే విషయంలో వ్యవహరిస్తున్న ఎన్నికల సంఘం, బిజెపి చేతిలో రాజకీయ ఆయుధాలుగా మారిన ఈడి, సిబిఐ, ఆదాయపు పన్ను శాఖ వంటి కేంద్ర సంస్థల అధికారులను ఎందుకు నియంత్రించలేకపోతోందని వారు ప్రశ్నించారు. ఎన్నికలు స్వేచ్ఛగా జరగకుండా బిజెపి యత్నిస్తోందని వారు విమర్శించారు. ప్రతిపక్ష నేతలను, ముఖ్యమంత్రులను ట్రాప్‌ చేసేందుకు కేంద్ర ఏజెన్సీలు యత్నిస్తున్నాయి. అధికార పార్టీకి చెందిన ఒక్క సభ్యుడిని కూడా అవి అరెస్టు చేయడం కానీ, విచారించడం కానీ చేయని విషయాన్ని వారు ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఎన్నికల ప్రకటన తరువాత ఏ ముఖ్యమంత్రిని అరెస్టు చేయడం ఇదే తొలిసారి. ప్రచార సమయంలో ఇలా చేయడం నిబంధనలకు విరుద్ధం. రాజ్యాంగ సంస్థలు సందేహాల నీడలో నిలబడకూడదు. ప్రతిపక్ష పార్టీల నేతలపై వేధింపులు ఆపాలి” అని నేతలు ఆ వినతిపత్రంలో కోరారు. కేంద్ర ప్రభుత్వ కక్ష సాధింపు చర్యల జాబితాను వారు ఇసికి అందజేశారు. ఎన్నికల సంఘం కమిషనర్లను కలిసిన వారిలో సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, టిఎంసి నేత డెరిక్‌ ఓబ్రియాన్‌, కాంగ్రెస్‌ నేతలు కెసి వేణుగోపాల్‌, అభిషేక్‌ మను సింఘ్వీ తదితరులు ఉన్నారు.

”బిజెపిలోకి ఫిరాయించిన ప్రతిపక్ష నాయకులకు రక్షణ కల్పించి, ఆదరిస్తుంది. వారంతా సత్యహరిశ్చంద్రులు! ఈ అరెస్టులు బిజెపిని ఓడించి ప్రజాస్వామ్యాన్ని, భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలన్న ప్రజల సంకల్పాన్ని మరింత దృఢతరం చేస్తుంది. ”
– సీతారాం ఏచూరి

 

➡️