పార్లమెంటు భద్రతా వైఫల్య ఘటన : ఆరో నిందితుడికి 13 రోజులపాటు కస్టడీ పొడిగింపు

Dec 23,2023 13:31 #Parliament Breach

న్యూఢిల్లీ : పార్లమెంటు భద్రతా వైఫల్య ఘటన కేసులో ఆరో నిందితుడు మహేష్‌ కుమావత్‌ పోలీసు కస్టడీని ఢిల్లీలోని పాటియాలా హౌస్‌ కోర్టు శనివారం 13 రోజులపాటు పొడిగించింది. ఈ కేసు విచారణలో భాగంగా నిందితుడు మహేష్‌ కస్టడీ పొడిగింపు కోసం ఢిల్లీ పోలీసుల దరఖాస్తును ప్రత్యేక న్యాయమూర్తి డాక్టర్‌ హర్దీప్‌ కౌర్‌ అనుమతించారు. నిందితుడికి సైకలాజికల్‌ టెస్ట్‌ జరుగుతుందని, అతని మనస్తత్వ విశ్లేషణ నివేదిక ఆధారంగా తదుపరి విచారణ కోసం 13 రోజులపాటు కస్టడీని పొడిగించాలని ఢిల్లీ పోలీసుల దరఖాస్తును ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ అఖండ్‌ ప్రతాప్‌సింగ్‌ కోర్టుకు సమర్పించారు. శనివారంతో నిందితుని 7రోజుల పోలీసుల కస్టడీ ముగియనుంది. ఈరోజు పాటియాల హౌస్‌ కోర్టులో ఢిల్లీ పోలీసులు ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. ఢిల్లీ పోలీసుల దరఖాస్తు మేరకు పాటియాలా హౌస్‌ కోర్టు నిందితునికి 13 రోజులపాటు కస్టడీని పొడిగించింది.

కాగా, డిసెంబర్‌ 13వ తేదీన పార్లమెంటు సమావేశాలు జరుగుతుండగా లోక్‌సభలోకి చొరబడి పొగబాంబులు విసిరారు. ఈ ఘటనకు పాల్పడిన ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి వారిపై ఉపాచట్టం కింద కేసు నమోదు చేశారు.

➡️