ఉల్లి ఎగుమతులను సమర్థించుకున్న కేంద్రం

Dec 13,2023 13:28 #export ban, #onion, #Parliament

 న్యూఢిల్లీ :    ఉల్లి ఎగుమతులపై నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం సమర్థించుకుంది. కొన్ని సమయాల్లో తగిన ధరలకు అవసరమైన వస్తువులను అందించేందుకు భారత వినియోగదారులకే ప్రాధాన్యతనిస్తుందని కేంద్రం మంగళవారం పేర్కొంది. మంగళవారం లోక్‌సభలో సప్లిమెంటరీ డిమాండ్స్‌ ఫర్‌ గ్రాంట్స్‌ చర్చ సందర్భంగా ఎన్‌సిపి నేత సుప్రియా సూలే ఉల్లి నిషేధాన్ని ప్రస్తావించారు. ఈ ప్రశ్నకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పై విధంగా సమాధానమిచ్చారు.

కేంద్ర ప్రభుత్వం రైతుల, వినియోగదారుల ప్రయోజనాలను జాగ్రత్తగా సమతుల్యం చేస్తోందని అన్నారు. ” నేను ఆందోళనలను అర్థం చేసుకున్నాను. ఒకవేళ పంట కొరత ఏర్పడితే మరియు మార్కెట్‌కు ఉల్లి వంటి అత్యవసర వస్తువులను తీసుకురావడంలో ఇబ్బందులు ఎదురైతే .. భారతీయ వినియోగదారులకే ప్రాధాన్యత లభిస్తుందని మేము నిర్థారించుకోవాలి. అందుకే ఇటువంటి చర్యలు తీసుకోవాల్సి వుంటుంది ” అని అన్నారు.

దేశీయ లభ్యతను పెంచేందుకు, ధరలను అదుపులో ఉంచేందుకు వచ్చే ఏడాది మార్చి వరకు ఉల్లి ఎగుమతులపై నిషేధాన్ని విధిస్తున్నట్లు కేంద్రం డిసెంబర్‌ 8న ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఉల్లి ధర కేజీ 60గా ఉంది.

ఉల్లి ఎగుమతలపై నిషేధాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా రైతులతో పాటు ప్రతిపక్షాలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. మహారాష్ట్రలోని నాసిక్‌ జిల్లాలో చాంద్‌ వాడ్‌ గ్రామంలో సోమవారం ఉల్లి రైతులు చేపట్టిన ఆందోళనలో ఎన్‌సిపి అధ్యక్షుడు శరద్‌ పవార్‌ కూడా పాల్గొన్నారు.  నిషేధాన్ని వెంటనే ఎత్తి వేయాలని డిమాండ్‌ చేశారు.  ఈ సందర్భంగా శరద్‌ పవార్‌ మాట్లాడుతూ.. రైతుల శ్రమను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు.  రైతులు ఐక్యంగా తమ హక్కులను సాధించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.  అనంతరం రైతులు ముంబయి -ఆగ్రా జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.

➡️