పశ్చిమబెంగాల్‌లో ఈడి అధికారులపై దాడి .. ఇద్దరికి గాయాలు

కోల్‌కతా  :    పశ్చిమబెంగాల్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడి) అధికారులపై శుక్రవారం దాడి జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు అధికారులకు గాయాలైనట్లు పోలీసులు తెలిపారు.

రేషన్‌ స్కామ్‌కి సంబంధించి అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌కు చెందిన బ్లాక్‌ లెవల్‌ నేతల నివాసాలపై సోదాలు జరిపేందుకు వెళుతుండగా.. సందేశ్‌కలి గ్రామానికి సమీపంలో దాడి జరిగినట్లు వెల్లడించాయి. టిఎంసి నేత నివాసం ఎదుట గుమిగూడిన ఆయన మద్దతుదారులు తాము  అక్కడికి చేరుకోగానే దాడికి దిగారని, తమ కార్లను ధ్వంసం చేసినట్లు ఈడి బృందం తెలిపింది. కారు అద్దాలు పగిలిపోయాయని పేర్కొంది.  ఘటనా స్థలానికి చేరుకున్న భద్రతా సిబ్బంది విచారణ చేపడుతోంది.

వివరాల ప్రకారం.. టిఎంసి నేత షేక్‌ షాజహాన్‌, బంగావ్‌ మునిసిపాలిటీ మాజీ చైర్మన్‌ శంకర్‌ ఆదిల నివాసాలపై నేడు ఈడి సోదాలు జరపాల్సి వుంది. షేక్‌ షాజహాన్‌ నార్త్‌ 24 పరగణాల జిల్లా పరిషత్‌కు చెందిన ఫిషరీస్‌ అండ్‌ యానిమల్‌ రీసోర్సెస్‌ అధికారి మరియు సందేశ్‌కలి 1 బ్లాక్‌ అధ్యక్షుడు.

➡️