Professor Saibaba: సజీవంగా బయటకు రావడమే ఆశ్చర్యం!

– జైలు నుంచి విడుదల అనంతరం ఫ్రొఫెసర్‌ సాయిబాబా

– దారుణ పరిస్థితులు ఎదుర్కొన్నట్లు వెల్లడి

ప్రజాశక్తి – న్యూఢిల్లీ బ్యూరో:దారుణ పరిస్థితుల మధ్య జైలు జీవితం అనుభవించానని.. చివరకు సజీవంగా బయటకు రావడం ఆశ్చర్యంగా ఉందని ఢిల్లీ విశ్వవిద్యాలయ మాజీ ప్రొఫెసర్‌ జిఎన్‌ సాయిబాబా చెప్పారు. మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో ఆయనపై నమోదైన కేసులో దాదాపు పదేళ్ల పాటు జైలులో ఉన్న ఆయనను నిర్దోషిగా ప్రకటిస్తూ ముంబయి హైకోర్టు తీర్పు వెలువరించిన సంగతి విదితమే. ఈ తీర్పు దరిమిలా ఆయన గురువారం నాడు జైలు నుంచి విడుదలయ్యారు. అనంతరం ఆయన మీడియాతో కొద్ది సేపు మాట్లాడారు. జైలులో అత్యంత దయనీమైన పరిస్థితులు ఎదుర్కొన్నట్లు ఆయన తెలిపారు. ‘వీల్‌ఛైర్‌ నుంచి బయటకు కదలలేకపోయా. సొంతగా టాయిలెట్‌కీ వెళ్లలేకపోయా. కనీసం పైకి లేచే పరిస్థితి లేదు. అక్కడ పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. జీవితం ముందుకు సాగడం కష్టమనిపించింది. కానీ, ఈరోజు సజీవంగా బయటకు రావడం నిజంగా ఆశ్చర్యమే’ అని ఆయన అన్నారు. తనపై పెట్టిన కేసు కల్పితమైందన్నారు. జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే మీడియాతో మాట్లాడేందుకు తొలుత నిరాకరించిన ఆయన.. ఆరోగ్యం ఎంతో క్షీణించిందని, ప్రస్తుతం ఏమీ మాట్లాడలేనన్నారు. మీడియా, న్యాయవాదుల విజ్ఞప్తితో మనసు మార్చుకున్న ఆయన.. జైల్లో తాను అనుభవించిన వేదనను వివరించారు. ఇదే విషయంపై సాయిబాబా కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. వాస్తవాలు లేవని రెండుసార్లు ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసినప్పటికీ ఈ కేసును ఎందుకు ఇంతకాలం సాగదీశారని ప్రశ్నించారు. పదేళ్ల జీవితం వఅథా అయ్యిందని, దాన్ని ఎవరు తిరిగి తెచ్చిస్తారని అన్నారు.మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని, దేశంపై యుద్ధం చేస్తున్నారని ఆరోపిస్తూ సాయిబాబాతో సహా మరో ఐదుగురిని మహారాష్ట్ర పోలీసులు 2014లో అరెస్టు చేయగా.. అప్పుడు రెండేళ్ల పాటు జైలులో ఉన్నారు. ఆ కేసులో బెయిల్‌పై బయటకు వచ్చారు. 2017లో గడ్చిరోలి సెషన్స్‌ కోర్టు నిందితులందరికీ జీవితఖైదు విధించడంతో మళ్లీ జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే విచారణ జరిపిన బాంబే హైకోర్టు.. ఉపా చట్టం కింద ప్రాసిక్యూషన్‌ చెల్లదంటూ తీర్పు ఇవ్వడంతో ఆయన విడుదలయ్యారు.

➡️