రెట్టింపు కానున్న ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ కేసులు

Apr 7,2024 00:22 #doubled, #Prostate cancer

– పెరగనున్న మరణాలు : లాన్సెట్‌ వెల్లడి
న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ కేసులు పెరిగిపోతున్నాయి. 2020ా2040 మధ్యకాలంలో ఈ కేసుల సంఖ్య రెట్టింపు కావచ్చని అంచనా. ఫలితంగా మరణాలు కూడా 85% మేర పెరగవచ్చునని లాన్సెట్‌ కమిషన్‌ అధ్యయనం తెలిపింది. ముఖ్యంగా పేద దేశాలు, ఓ మోస్తరు ఆదాయం కలిగిన దేశాలు ఈ వ్యాధి కారణంగా తీవ్ర ఇబ్బందులు పడతాయని హెచ్చరించింది. కేసుల సంఖ్యలో పెరుగుదల అనివార్యమని తేల్చి చెప్పింది. వ్యాధి నిర్ధారణ సరిగా జరగకపోవడం, సకాలంలో చేయకపోవడం వంటి కారణాలతో బాధితుల సంఖ్య మరింత పెరగవచ్చునని తెలిపింది. వృద్ధుల సంఖ్య పెరగడం, జీవితకాలం మెరుగుపడడం వల్ల వయసు మీరిన వారిలో ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి. దీనిని దృష్టిలో పెట్టుకొని ఓ ప్రణాళికను రూపొందించుకోవాల్సిన అవసరం ఉన్నదని, తగిన చర్యలు చేపట్టాలని అధ్యయనం సూచించింది.
వ్యాధిని ముందుగానే కనిపెట్టి, అవసరమైన చికిత్స అందించాలని, ప్రొస్టేట్‌ క్యాన్సర్‌పై ప్రజలకు మరింత అవగాహన కలిగించాలని లాన్సెట్‌ కమిషన్‌ సూచించింది. ఈ చర్యల ద్వారా ప్రజల ప్రాణాలు కాపాడవచ్చునని తెలిపింది. వ్యాధిపై జన్యుపరమైన పరిజ్ఞానం పెరుగుతోందని, దీంతో పరమాణువు లక్ష్యంగా చికిత్సలను అభివృద్ధి చేయడానికి అవకాశం ఏర్పడుతుందని వివరించింది. రోగికి ఏ రకమైన చికిత్స అందించాలనే విషయాన్ని అంచనా వేయడానికి కృత్రిమ మేథ పరిజ్ఞానం ఉపకరిస్తుందని ఔషధ కంపెనీ ‘పెప్‌ట్రిస్‌’ సహ వ్యవస్థాపకుడు నారాయణన్‌ వెంకట సుబ్రమణ్యన్‌ చెప్పారు.

➡️