రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి

Dec 29,2023 21:40 #AILU, #Mahasabha

– ఐలు 14వ అఖిల భారత మహాసభలో జస్టిస్‌ ఎస్‌ మురళీధర్‌ పిలుపు

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో:మతోన్మాదం, మతపరమైన సమీకరణలు శాంతి భద్రతలకు ముప్పు తెచ్చాయని పంజాబ్‌, ఒడిశా, హర్యానా రిటైర్డు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ మురళీధర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. దేశ ప్రజలు అయోమయంలో ఉన్నారని, వారికి దారిచూపాల్సిన బాధ్యత న్యాయవాదులపై ఉందని పేర్కొన్నారు. ‘రాజ్యాంగాన్ని మార్చండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి’ అన్నదే నేటి నినాదమని అన్నారు. ఆ లక్ష్య సాధనలో చట్టాన్ని అధ్యయనం చేసే, బోధించే, వాదించే న్యాయవాదులపై బృహత్తర బాధ్యత ఉందని తెలిపారు. పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా నగరంలో ఆల్‌ ఇండియా లాయర్స్‌ యూనియన్‌ (ఐలు) 14వ మహాసభ గురువారం ప్రారంభమైంది. ‘చట్టం, ప్రజాస్వామ్యం’ అనే అంశంపై జస్టిస్‌ ఎస్‌ మురళీధర్‌ మాట్లాడారు. ప్రజలందరికీ న్యాయం అందాలని, అందుకోసం ఐలు పనిచేయాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో చట్టం చాలా కీలకమైందన్నారు. అట్టడుగు వర్గాల వారికి చట్టాలు అందుబాటులోకి రావాలని పేర్కొన్నారు. మీడియా స్వేచ్ఛపై దాడి : టెలిగ్రాఫ్‌ ఎడిటర్‌ రాజగోపాల్‌దేశంలో మీడియా స్వేచ్ఛపై దాడి జరుగుతుందని టెలిగ్రాఫ్‌ దినపత్రిక ఎడిటర్‌ ఆర్‌ .రాజగోపాల్‌ అన్నారు. మీడియా స్వేచ్ఛ, ఆధిపత్యం’ అనే అంశంపై శుక్రవారం జరిగిన సెమినార్‌లో ఆయన మాట్లాడారు. కొంతమంది చేతుల్లోనే ప్రధాన మీడియా స్రవంతి ఉందని, ప్రజా సమస్యలు పక్కదారి పడుతున్నాయని తెలిపారు. మీడియా రంగంలోకి కార్పొరేట్‌ దిగ్గజాలు ప్రవేశించి, మీడియా విలువలను దిగజార్చాయని విమర్శించారు. ప్రభుత్వాల కనుసన్నల్లో మీడియా సంస్థలు నడుస్తున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించే మీడియా దాడులను ఎదుర్కొంటున్నదని పేర్కొన్నారు. జర్నలిస్టులపై దాడులు పెరిగాయని, హత్యలకు గురవుతున్నారని తెలిపారు. మీడియా రంగం సమూలంగా మారిందని, వాస్తవికతకు దూరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పలు తీర్మానాల ఆమోదం పాలస్తీనాలో ఇజ్రాయిల్‌ మారణకాండను, మహిళలు, పిల్లలపై దారుణ హింసాకాండను ఖండిస్తూ చేసిన తీర్మానం మహాసభ ఆమోదించింది. స్థానిక భాషలను హైకోర్టు అధికార భాషగా చేయడం, న్యాయ వ్యవస్థలో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం, మణిపూర్‌ అల్లర్లను ఖండించడం, జూనియర్‌ న్యాయవాదులకు స్టైఫండ్‌ అందించడం, దేశవ్యాప్త ఏకీకృత న్యాయవాద సంక్షేమాన్ని అమలు చేయడానికి బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాను సిద్ధం చేయడం వంటి తీర్మానాలను మహాసభ ఆమోదించింది. ప్రధాన కార్యదర్శి నివేదికపై చర్చలో 26 రాష్ట్రాల నుంచి 81 మంది ప్రతినిధులు పాల్గన్నారు. తమ రాష్ట్రాల్లో న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలు, నిర్వహించిన పోరాటాలను వివరించారు. ప్రజా సంఘాల సౌహార్థ సందేశాలు ఎస్‌ఎఫ్‌ఐ అఖిల భారత కార్యదర్శి మయూఖ్‌ బిస్వాస్‌, మహిళా సంఘం అఖిల భారత కార్యదర్శి కొణినికా ఘోష్‌, పీపుల్స్‌ రిలీఫ్‌ కమిటీ కార్యదర్శి ఫువాద్‌ హలీమ్‌ తదితరులు సౌహార్థ సందేశాలిచ్చారు.ఘనంగా మహాసభ ప్రారంభంఐలు 14వ అఖిల భారత మహాసభ హౌరాలోని అశోక్‌ బికాష్‌ మంచ్‌, నారా నారాయణ్‌ గుప్తా నగర్‌లో గురువారం ఘనంగా ప్రారంభమైంది. ‘మతోన్మాదంపై పోరాటం, రాజ్యాంగాన్ని కాపాడండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి’ నినాదంతో జరుగుతున్న ఈ మహాసభను సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ గుప్తా ప్రారంభించారు. పశ్చిమ బెంగాల్‌ మాజీ న్యాయశాఖ మంత్రి, ఐలు సీనియర్‌ నాయకులు రబిలాల్‌ మైత్రా పతకావిష్కరణ చేశారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, ఆహ్వాన సంఘం కమిటీ ఛైర్మన్‌ జస్టిస్‌ ఎకె గంగూలీ స్వాగతోపన్యాసం చేశారు. ప్రారంభ సమావేశానికి ఐలు ఆలిండియా అధ్యక్షులు బికాష్‌ రంజన్‌ భట్టాచార్య అధ్యక్షత వహించారు. ఐలు ప్రధాన కార్యదర్శి పివి సురేంద్రనాథ్‌ కార్యాచరణ నివేదికను సమర్పించారు. మూడు రోజుల పాటు జరిగే మహాసభకు వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి 600 మంది ప్రతినిధులు హాజరయ్యారు.

➡️