బిల్లులపై కేరళ గవర్నర్‌ తీరులోనే పంజాబ్‌ గవర్నర్‌

చంఢీఘర్   : కేరళ గవర్నర్‌ వ్యవహరించినట్లుగానే పంజాబ్‌ గవర్నర్‌ భన్వరీలాల్‌ పురోహిత్‌ కూడా బిల్లులను రాష్ట్రపతి ఆమోదం కోసం పంపారు.  పంజాబ్‌ అసెంబ్లీ ఆమోదించిన మూడు బిల్లులను రాష్ట్రపతి పరిశీలన కోసం రిజర్వు చేసినట్లు గవర్నర్‌ కార్యాలయం బుధవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. రాష్ట్ర శాసన సభలు ఆమోదించిన బిల్లులను గవర్నర్లు నిరవధికంగా నిలిపివేయడం సరికాదని ఇటీవల సుప్రీంకోర్టు నిలదీయడంతో.. కేరళ గవర్నర్‌ ఏడు బిల్లులను రాష్ట్రపతి ఆమోదం కోసం రిజర్వు చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 200 ప్రకారం.. మూడు బిల్లులను రాష్ట్రపతి పరిశీలన కోసం పంపుతున్నట్లు ఆ ప్రకటనలో తెలిపింది. సిక్కు గురుద్వారాస్‌ (సవరణ) బిల్లు 2023, పంజాబ్‌ యూనివర్శిటీస్‌ లా ( సవరణ) బిల్లు 2023, పంజాబ్‌ పోలీస్‌ (సవరణ) బిల్లు 2023లు ఉన్నాయి. సిక్కు గురుద్వారా (సవరణ ) బిల్లు లక్ష్యం అమృతసర్‌లోని గోల్డెన్‌ టెంపుల్‌లో గుర్బానీని ప్రసారం చేసే హక్కులను విడిపించడం. పంజాబ్‌ పోలీస్‌ సవరణ బిల్లు ప్రకారం డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ ఎంపిక కోసం స్వతంత్ర యంత్రాంగాన్ని తీసుకురావడం.

➡️