‘బేటీ బచావో బేటీ పడావో’ లోగో పెట్టండి : విద్యాసంస్థలకు యుజిసి ఆదేశం

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కేంద్ర ప్రభుత్వ ‘బేటీ బచావో బేటీ పడావో (బిబిబిపి)’ నినాదానికి సంబంధించిన లోగోను తమ ప్రాంగణంలో ఇన్‌స్టాల్‌ చేసుకోవాలని, అలాగే తమ వెబ్‌సైట్‌, స్టేషనరీ వస్తువులపై కూడా ఉపయోగించాలని యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యుజిసి) అన్ని విశ్వవిద్యాలయాలు, కళాశాలలను ఆదేశించింది. ప్రధాని మోడీ కటౌట్లతో సెల్ఫీ పాయింట్లు ఏర్పాటు చేయాలని యుజిసి గతంలో ఉన్నత విద్యా సంస్థలను కోరింది. ఈ మేరకు యుజిసి అన్ని విశ్వవిద్యాలయాల వైస్‌ ఛాన్సలర్లు, అన్ని కళాశాలల ప్రిన్సిపల్స్‌కు బిబిబిపి లోగోలను ఉపయోగించి బాలికల విలువపై అవగాహన కల్పించాలని లేఖ రాసింది. వెబ్‌సైట్‌, పోర్టల్‌లు, స్టేషనరీ వస్తువులు, ఈవెంట్లు, హెచ్‌ఇఐల ప్రాంగణంలో ఉన్న ప్రముఖ ప్రదేశాలలో బిబిబిపి లోగోను ఉపయోగించాలని నిర్దేశించింది. ఆడపిల్లల హక్కులు, మహిళల సాధికారత నిబద్ధతను తెలియజేసేందుకు ఈ ఉత్తర్వులు జారీ చేశామని యుజిసి కార్యదర్శి మనీష్‌ జోషి లేఖలో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి నిర్వహించిన కార్యక్రమాలను ఫోటోలను, వీడియోలను ష్ట్ర్‌్‌జూర://బaఎశీ.బవష.aష.ఱఅలో అప్‌లోడ్‌ చేయాలని సూచించారు. అయితే యుజిసి ఉత్తర్వులపై విద్యావేత్తలు విమర్శిలు గుప్పిస్తున్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి రాజకీయ వేదికలుగా మార్చేందుకు యుజిసి ఇలాంటి ఆదేశాలు జారీ చేస్తోందని పలువురు విద్యావేత్తలు విమర్శించారు. అవగాహన కార్యక్రమాల గురించి విద్యా సంస్థలు ఏమి చేయాలో యుజిసి నిర్దేశిస్తోందని, ఇది మంచిది కాదని, ఆయా సంస్థల స్వతంత్రను కాపాడాలని సూచించారు. యుజిసి ఉత్తర్వులు ప్రభుత్వానికి రాజకీయ ప్రచారాన్ని కల్పించే శాసనంగా ఢిల్లీ యూనివర్సిటీ (డియు) అకడమిక్‌ కౌన్సిల్‌ (ఎసి) సభ్యులు మాయా జాన్‌ అభివర్ణించారు. ఇటువంటి చర్యలు టీచింగ్‌, రీసెర్చ్‌ వంటి క్లిష్టమైన రంగాల నుండి విద్యాసంస్థ దృష్టిని మళ్లిస్తాయని అన్నారు. ‘జి20పై అవగాహన, స్వచ్ఛతా ప్రచారం వంటి కార్యకలాపాలను నిర్వహించడానికి ప్రభుత్వం, యుజిసి విద్యా సంస్థలను క్రమం తప్పకుండా నడపడం ఒక నమూనాగా మారింది. ఇవి పూర్తిగా రాజకీయ ప్రచారమే’ అని ఆమె అన్నారు. విద్యా సంస్థల స్వయం ప్రతిపత్తికి ఆటంకం కలిగించడానికి నిరంతర ప్రయత్నం జరుగుతోందని ఆమె విమర్శించారు.

➡️