హర్యానాలోని వీరేందర్‌ అఖాడాలో ప్రత్యక్షమైన రాహుల్‌ గాంధీ

Dec 27,2023 12:34 #Protest, #Rahul Gandhi, #Wrestlers

 చంఢీఘర్   :   హర్యానాలోని ఝజ్జర్‌ జిల్లాలోని వీరేందర్‌ అఖాడా ( రెజ్లింగ్‌ శిబిరం)లో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీని చూసి రెజ్లర్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బుధవారం ఉదయం అక్కడకు చేరుకున్న రాహుల్‌ వారితో కలిసి వ్యాయామం చేయడంతో పాటు ‘జిజు జిట్సు ‘ (జపనీస్‌ కుంగ్‌ఫూ) అనుభవాలను పంచుకున్నారు. రాహుల్‌ గాంధీని కలిసిన వారిలో బజరంగ్‌ పూనియా సహా పలువురు రెజ్లర్లు ఉన్నారు.

రాహుల్‌ గాంధీ ఇక్కడకు వస్తున్నట్లు తెలియదని, ఎవరూ సమాచారమివ్వలేదని ఓ రెజ్లర్‌ తెలిపారు. తాము ఇక్కడ ప్రాక్టీస్‌ చేస్తున్నామని, ఉదయం 6.15 గంటలకు ఆయన అఖాడాకు వచ్చారని అన్నారు. ఆయనకు కుస్తీపై అవగాహన ఉందని, జిజు జిట్సు గురించి వివరించి, కొన్ని ఎత్తుగడలు చెప్పారని అన్నారు. రెజ్లింగ్‌ గురించి, పాయింట్లు ఎలా లెక్కిస్తారో అడిగి తెలుసుకున్నారని, బజ్రేకీ రోటీ, పెరుగు, హరాసాగ్‌ తీసుకున్నారని అన్నారు.

ఆందోళనలపై రెజ్లర్లు ఎలా స్పందిస్తున్నారన్న మీడియా ప్రశ్నకు సమాధానమిస్తూ.. రెజ్లర్లలో కొంత ఆందోళన ఉందని, కానీ ఈ సమస్య పరిష్కారం తమ చేతుల్లో ఉందని, ప్రభుత్వం చేతుల్లో ఉందని అన్నారు. భారతదేశ కుమార్తెల న్యాయం కోసం పోరాటంలో చేరడానికి అఖారాలో కుస్తీని విడిచిపెట్టవలసి వచ్చింది. ఈ పరిస్థితుల్లో ఈ మార్గాన్ని ఎంచుకోమని వారి పిల్లలను ఎలా ప్రోత్సహిస్తారని రాహుల్‌ ప్రశ్నించారు. ఈ వ్యక్తుల రైతుల కుటుంబాలకు చెందిన వారు, సాధారణ ప్రజలు. త్రివర్ణ పతాకానికి సేవ చేయనివ్వండి అని ఎక్స్‌ లో ట్వీట్‌ చేశారు.

బిజెపి ఎంపి బ్రిజ్‌భూషణ్‌ సింగ్‌ మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ ఆందోళనలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బ్రిజ్‌ భూషణ్‌ సన్నిహితుడు సంజరు సింగ్‌ విజయం సాధించారు. అయితే ఈ ఎన్నికలపై రెజ్లర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రముఖ రెజ్లర్‌ సాక్షి మాలిక్‌ రిటైర్మెంట్‌ ప్రకటించగా, బజరంగ్‌ పూనియా, వీరేందర్‌ యాదవ్‌ పద్మశ్రీ అవార్డులను వెనక్కు ఇచ్చేశారు. ఖేల్‌రత్న, అర్జున అవార్డులను వెనక్కి ఇచ్చేస్తున్నట్లు వినేష్‌ ఫోగాట్‌ ప్రకటించారు. రెజ్లర్ల ఆందోళనకు తలగ్గిన కేంద్రం డబ్ల్యుఎఫ్‌ఐ పాలక కమిటీని సస్పెండ్‌ చేయడం గమనార్హం.

➡️