అది మోడీ రాజకీయ కార్యక్రమం

Jan 16,2024 16:54 #PM Modi, #Rahul Gandhi
delhi high court on rahul gandhi modi comments
  • అయోధ్య రామమందిరంపై రాహుల్‌

కోహిమా : అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవాన్ని బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌లు ‘నరేంద్ర మోడీ రాజకీయ కార్యక్రమం’గా మార్చేశాయని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ విమర్శించారు. భారత్‌ జోడో న్యాయ యాత్ర చేపట్టిన తర్వాత రాహుల్‌ నాగాలాండ్‌లోని చిచామాలో విలేకరులతో ముచ్చటించారు. ‘బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌లు ఈ నెల 22న జరిగే రామ మందిర ప్రారంభోత్సవాన్ని నరేంద్ర మోడీ రాజకీయ కార్యక్రమంగా మార్చేశారు. అందుకే ఈ కార్యక్రమానికి తాను వెళ్లడం లేదని మా పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే స్పష్టం చేశారు’ అని చెప్పారు. తాము అన్ని మతాలను, వాటి విశ్వాసాలను గౌరవిస్తామని తెలిపారు. అయోధ్యలో జరిగే కార్యక్రమం గురించి హిందూ మత పెద్దలు కూడా తమ అభిప్రాయాలు తెలియజేశారంటూ పరోక్షంగా శంకరాచార్యుల వ్యాఖ్యలను ప్రస్తావించారు. రాముడి కేంద్రంగా సాగాల్సిన వేడుక ప్రధాని చుట్టూ తిరగడం తమకు కష్టంగా ఉన్నదని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ సభ్యులు కానీ, భాగస్వామ్య పక్షాల వారు కూడా అయోధ్య కార్యక్రమానికి హాజరవ్వాలని అనుకుంటే వెళ్లవచ్చునని చెప్పారు. ‘ఆయన మతాన్ని రాజకీయంగా ఉపయోగించుకుంటారు. మతంతో సంబంధాలు కొనసాగించాలని కోరుకునే వారు దాని నుంచి ప్రయోజనం పొందాలని భావిస్తారు. దానిపై నాకేమీ ఆసక్తి లేదు. నేను మత సిద్ధాంతాల ఆధారంగా జీవించేందుకు ప్రయత్నిస్తాను. నేను ప్రజలతో మంచిగా ప్రవర్తిస్తాను. వారిని గౌరవిస్తాను. ఎవరైనా నాకు ఏమైనా చెప్పాలని అనుకుంటే అహంకారం ప్రదర్శించను. వారు చెప్పేది వింటాను. విద్వేషాలు వ్యాపింపజేయను. నాకు సంబంధించినంత వరకూ ఇదే హిందూ మతం. నేను జీవితంలో దీనిని అనుసరిస్తాను. నేను దానిని నా శరీరంపై కప్పుకోవాల్సిన అవసరం లేదు. దానిపై నమ్మకం లేని వారే మతాన్ని ఒంటిపై పులుముకుంటారు’ అని రాహుల్‌ వ్యాఖ్యానించారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బిజెపిని ఎదుర్కొనేందుకు ఇండియా కూటమి సన్నద్ధంగా ఉన్నదని తెలిపారు. తన యాత్ర సైద్ధాంతికమైనదని, దేశంలో చోటుచేసుకుంటున్న అసమానతలు సహా అది అనేక సమస్యలను ముందుకు తెస్తుందని, దేశానికి ప్రత్యామ్నాయ కోణాన్ని అందిస్తుందని తెలిపారు.

➡️