NEET పై చర్చకు అనుమతించండి : ప్రధానికి రాహుల్‌ గాంధీ లేఖ

Jul 2,2024 18:04 #NEET, #Parliament, #PM Modi, #Rahul Gandhi

న్యూఢిల్లీ :  పార్లమెంటులో నీట్‌ పై చర్చ చేపట్టాలని కోరుతూ మంగళవారం ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ ప్రధాని మోడీకి లేఖ రాశారు. జూన్‌ 28 నుండి సోమవారం వరకు పార్లమెంట్‌ ఉభయ సభల్లోనూ నీట్‌పై చర్చ జరపాలన్న ప్రతిపక్షాల అభ్యర్థనను తిరస్కరించారని, బుధవారం చర్చకు అనుమతించాలని పేర్కొన్నారు. ప్రభుత్వంతో చర్చిస్తానని లోక్‌సభ స్పీకర్‌ ప్రతిపక్షాలకు హామీ ఇచ్చారని అన్నారు.

నీట్‌పై పార్లమెంటులో చర్చను అభ్యర్థించడానికి వ్రాస్తున్నాను అని రాహుల్‌ గాంధీ లేఖలో పేర్కొన్నారు. నిర్మాణాత్మకంగా ముందడుగు వేయడానికి మార్గం గుర్తించడమే తమ లక్ష్యమని అన్నారు. ఈ సమయంలో దేశవ్యాప్తంగా సుమారు 24 లక్షల నీట్‌ అభ్యర్థుల సంక్షేమమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. నీట్‌పై తక్షణమే దృష్టి సారించాల్సి వుందని, ఎందుకంటే ఇది మన ఉన్నత విద్యావ్యవస్థలో పాతుకుపోయిన మోసాన్ని వెలుగులోకి తీసుకువచ్చిందని అన్నారు. గడిచిన ఏడేళ్లలో 70ప్రశ్నాపత్రాలు లీకయ్యాయని, 2 కోట్లకు పైగా విద్యార్థులు ప్రభావితమయ్యారని లేఖలో తెలిపారు.

విద్యార్థులు సమాధానం తెలుసుకునేందుకు అర్హులని, వారి విశ్వాసాన్ని పునర్‌నిర్మించడానికి, పునరుద్ధరించేందుకు పార్లమెంటులో చర్చ మొదటి అడుగు అని అన్నారు. ఈ సమస్య తీవ్రతను పరిగణనలోకి తీసుకుని, బుధవారం ఈ అంశంపై చర్చకు ప్రభుత్వం అనుమతించాలని కోరుతున్నానని అన్నారు. విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా మీరు ఈ చర్చకు నేతృత్వం వహిస్తే అది సముచితంగా ఉంటుందని విశ్వసిస్తున్నానని పేర్కొన్నారు.

➡️