ఓటు కోసం రామజపం

Apr 20,2024 11:08 #Rama Japam, #vote
  • ఎన్నికలకు ఒక రోజు ముందు బిజెపి మత రాజకీయం
  • అయోధ్య రాముడి విగ్రహ ఫోటోను పోస్ట్‌ చేసిన కాషాయ పార్టీ
  • ‘పవర్‌ ఆఫ్‌ వన్‌ ఓట్‌’ అంటూ క్యాప్షన్‌ జత
  • వివాదంగా మారిన సోషల్‌ మీడియా పోస్ట్‌

న్యూఢిల్లీ : 2024 లోక్‌సభ ఎన్నికల మొదటి దశ పోలింగ్‌కు ఒక రోజు ముందు బిజెపి సోషల్‌ మీడియాలో చేసిన ఒక పోస్ట్‌ వివాదాస్పదమవుతున్నది. ఓట్ల కోసం మళ్లీ మతాన్ని, రాముడి పేరును వాడుకున్నది. ‘పవర్‌ ఆఫ్‌ వన్‌ ఓట్‌’ అంటూ అయోధ్యలో బాల రాముడిని నుదిటిని తాకిని సూర్యతిలకంగా చెప్పబడుతున్న ఒక ఫోటోను ఆ పార్టీ పోస్ట్‌ చేసింది. శుక్రవారం నుంచి దేశవ్యాప్తంగా తొలి విడత ఎన్నికలు జరగనుండగా.. ఈనెల 18న(గురువారం) తన పార్టీ తన ‘ఎక్స్‌’ ఖాతాలో ఈ వివాదాస్పద పోస్ట్‌ను పెట్టింది. అయితే, మతం పేరుతో ఒక వర్గాన్ని ప్రభావితం చేసేలా ఆ బిజెపి ‘ఎక్స్‌’ హ్యాండిల్‌ ఇలాంటి పోస్ట్‌ చేయటం పట్ల ప్రతిపక్ష పార్టీలు అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని (ఇసి)ని కోరుతున్నాయి.
భారత్‌లో ఎన్నికలు ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951 ప్రకారం నియంత్రించబడతాయనీ, 123 (3) సెక్షన్‌ ప్రకారం మతాన్ని ఓట్ల కోసం ఉపయోగించటమనేది అవినీతి పద్ధతులుగా పరిగణించబడుతుంది. ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్‌ 126 ప్రకారం 48 గంటల సైలెన్స్‌ పీరియడ్‌ ఉంటుంది. ఇలాంటి సమయంలోనూ బిజెపి ఈ విధమైన పోస్ట్‌ చేయటాన్ని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఈ సమయంలో అభ్యర్థులు, పార్టీలు ఎన్నికలకు వెళ్లే నియోజకవర్గాల్లో ప్రచార సందేశాలను వ్యాప్తి చేయకుండా మౌనం పాటించాలి. కానీ, కాషాయ పార్టీ ఇవేమీ పట్టనట్టు ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి పోస్ట్‌లను సామాజిక మాధ్యమాల్లో వదులుతున్నదని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. కాగా, ప్రచారంలో మతం, వీడియో వినియోగంపై ఎన్నికల సంఘానికి సామాజిక కార్యకర్తలు కొందరు లేఖ రాసినట్టు సమాచారం. దేవాలయాలు, మసీదులు, చర్చిలు, గురుద్వారాలు, ఏ ప్రార్థనా స్థలాలనూ ఎన్నికల ప్రచారానికి ఉపయోగించరాదని ఇసి ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలకు స్పష్టం చేసింది. అయినప్పటికీ.. బిజెపి అదేమీ పట్టనట్టుగా వ్యవహరించటం గమనార్హం.

➡️