రాముడి జన్మస్థలం బిజెపికి గుణపాఠం

Jul 2,2024 00:30 #loksabha, #Rahul Gandhi
  • లోక్‌సభలో రాహుల్‌ గాంధీ
  • ‘అగ్నివీర్‌’తో యువకుల ఆత్మ స్థైర్యానికి దెబ్బ : రాజ్యసభలో ఖర్గే

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : రాముడి జన్మస్థలం అయోధ్య ప్రజలు బిజెపిని ఓడించి తగిన గుణపాఠం నేర్పారని ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. సోమవారం లోక్‌సభలో రాష్ట్రప్రతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరిగింది. సభలో మొదట వివిధ కమిటీల నియామకాలకు సంబంధించిన ప్రతిపాదనలను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు సభ ముందుంచారు. ఆ తరువాత రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు స్పీకర్‌ ఓంబిర్లా అనుమతించారు. బిజెపి ఎంపి అనురాగ్‌ ఠాకూర్‌ చర్చను ప్రారంభిస్తూ మోడీ నాయకత్వంపై విశ్వాసంతో దేశ ప్రజలు వరుసగా మూడోసారి ఎన్‌డిఎను గెలిపించారని, మోడీ ప్రభుత్వం పేదరికాన్ని తరిమివేసేందుకు పనిచేస్తోందని అన్నారు. ఈ తీర్మానంపై రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ రాజ్యాంగంపై దాడిని ఖండించిన వారిపై ఎన్‌డిఎ సర్కార్‌ దాడులకు దిగుతోందని, కొందరిని వ్యక్తిగతంగా టార్గెట్‌ చేశారని విమర్శించారు. చేయని తప్పులకు శిక్ష అనుభవిస్తూ కొందరు నాయకులు ఇప్పటికీ జైల్లో ఉన్నారని, పేదలు, దళితులు, మైనారిటీలు, వివిధ వర్గాల ప్రజలపై జరుగుతున్న దౌర్జన్యాలను ప్రశ్నించినందుకు దర్యాప్తు సంస్థలతో తనపైనా దాడులకు తెగబడ్డారని విమర్శించారు. ఇడితో 55 గంటల విచారణ చేయించారని, కానీ ఏమీ లేదని స్పష్టమైందని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో రాజ్యాంగాన్ని రక్షించుకున్నామని, ఇప్పుడు బిజెపి నేతలు రాజ్యాంగం ముందు తలవంచి జై సంవిధాన్‌ అనడం ఆనందంగా ఉందని, రాజ్యాంగానికి రక్షణగా ఉంటామని, అధికారం కంటే నిజం గొప్పదని అన్నారు. అయోధ్య విమానాశ్రయం కోసం భూసేకరణ చేసి రైతులకు నష్టపరిహారం ఇవ్వలేదని, చిరు వ్యాపారుల పొట్టకొట్టారని, దాని ప్రారంభానికి అదానీని పిలిచారని విమర్శించారు. రాములవారి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి సైతం మోడీ ఇదే ధోరణి అవలంబించారన్నారు. అయోధ్య ఉన్న ఫైజాబాద్‌ ఎంపి నియోజకవర్గంలో ఇండియా ఫోరం నేత ఘన విజయం సాధించారని, రాముడి జన్మస్థలం బిజెపికి గుణపాఠం నేర్పిందని, స్పష్టమైన సందేశం ఇచ్చిందని పేర్కొన్నారు. ఫైజాబాద్‌లో పోటీచేయాలని అనుకున్నా, సర్వేలన్నీ వ్యతిరేకంగా రావడంతో వారణాసి నుంచి మోడీ పోటీ చేశారన్నారు. ఫైజాబాద్‌ ఎంపి, సమాజవాదీ పార్టీ నేత అవధేష్‌ ప్రసాద్‌కు రాహుల్‌ గాంధీ షేక్‌హ్యాండ్‌ ఇచ్చి.. శభాష్‌ అని మెచ్చుకున్నారు. అన్ని మతాల్లో ధైర్యం గురించి ఉంటుందని, హిందూ, ఇస్లాం, సిక్కు ఇలా అన్ని మతాలు ఎన్నో విషయాలను బోధిస్తాయని చెప్పారు. శివుని ఫోటో చూపిస్తూ.. తమని తాము 24 గంటలపాటు హిందువులమని చెప్పుకునే వారిలో హింస, ద్వేషం, అసత్యం కురుకుపోయి ఉంటుందని, హిందూ మతం పేరు చెప్పి బిజెపి అందరినీ భయపెడుతోందని అన్నారు. హింసను ప్రేరేపించే వాళ్లు హిందువులే కారని, అసలు వారిని హిందువులని ఎలా అనగలమని ప్రశ్నించారు.

ప్రధాని మోడీ అభ్యంతరం
రాహుల్‌ చేసిన వ్యాఖ్యలపై లోక్‌సభలో స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ లేచి అభ్యంతరం వ్యక్తం చేశారు. రాహుల్‌ ప్రసంగాన్ని అడ్డుకొని, ఈ విషయం ఎంతో తీవ్రమైందని, హిందూ సమాజాన్ని హింసాత్మకమని పేర్కొనడం తీవ్రంగా పరిగణించాల్సిన విషయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకు రాహుల్‌ బదులిస్తూ.. ”నరేంద్రమోడీ ఒక్కరే మొత్తం హిందూ సమాజం కాదు, అలాగే ఆర్‌ఎస్‌ఎస్‌ ఒక్కటే హిందూ సమాజం కాదు” అని అన్నారు. తాను కేవలం ప్రధాని మోడీని, బిజెపిని, ఆర్‌ఎస్‌ఎస్‌ని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేశానని, మొత్తం హిందూ సమాజాన్ని ఉద్దేశించి కాదని స్పష్టం చేశారు.

శివుని ఫోటో నిషేధమా?
రాహుల్‌ గాంధీ శివుని చిత్రం చూపించడంపై స్పీకర్‌ ఓం బిర్లా అభ్యంతరం వ్యక్తం చేస్తూ సభలో ప్లకార్డ్‌లు, ఫొటోలు ప్రదర్శించడం నిషేధం అని తేల్చి చెప్పారు. ఇందుకు రాహుల్‌ బదులిస్తూ ఈ సభలో శివుని బొమ్మని చూపించడం నిషేధమా? అని పదేపదే ప్రశ్నించారు. తన మెడకు పాము చుట్టిముట్టినప్పుడు తాను వాస్తవాన్ని అంగీకరిస్తానని శివుడు చెప్పాడని, ఆయన చేతిలో ఉన్న త్రిశూలం అహింసకు ప్రతీక అని వివరించారు. ఒకవేళ హింసకి ప్రతీక అయితే, ఆ త్రిశూలం కుడిచేతిలో ఉండేదని రాహుల్‌ గాంధీ చెప్పుకొచ్చారు. తాను శివుని నుంచే ప్రేరణ పొందానని, ప్రతిపక్షంలో ఉన్నందుకు గర్వపడుతున్నానని రాహుల్‌ పేర్కొన్నారు.

మాది సామాన్యుడి మాట… మోడీది మనసులో మాట
రాజ్యసభలో ప్రతిపక్షనేత ఖర్గే ఎద్దేవా
తుగ్లక్‌ స్కీమ్‌ అగ్నివీర్‌ను రద్దు చేయాలి
ప్రతిపక్షాలది సామాన్యుడి మాట అని, ప్రధాని మోడీది మనసులో మాట అని రాజ్యసభ ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గే ఎద్దేవా చేశారు. సోమవారం రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో ఆయన మాట్లాడారు. పార్లమెంటులో రాష్ట్రపతికి కీలభ భూమిక ఉందని, తాము గౌరవిస్తామని చెప్పారు. ఈఏడాది రాష్ట్రపతి తొలి ప్రసంగం జనవరిలోనూ, రెండో ప్రసంగం జూన్‌లోనూ చేశారని, ఎన్నికల కోసం తొలి ప్రసంగం చేస్తే, రెండోది దానికి కాపీ మాత్రమేనని అన్నారు. దళితులు, మైనారిటీలు, వెనుకబడిన తరగతుల గురించి ఎక్కడా రాష్ట్రపతి తమ ప్రసంగంలో ప్రస్తావించనే లేదని, రాష్ట్రపతి ప్రసంగానికి ఒక విజన్‌ కానీ, డైరెక్టన్‌ కానీ లేదని పేర్కొన్నారు. మణిపూర్‌ రగులుతుండటడాన్ని ఖర్గే ప్రస్తావిస్తూ, నినాదాలు ఇవ్వడంలో ప్రధానమంత్రి నిపుణుడని, ఏడాదిగా మణిపూర్‌ రగులుతున్నా ఆ రాష్ట్రంలో ఒక్కసారి కూడా ఆయన పర్యటించలేదని విమర్శించారు. పార్లమెంటు కాంప్లెక్స్‌లోని మహాత్మాగాంధీ, అంబేద్కర్‌, ఇతర నాయకుల విగ్రహాలను తిరిగి యథాస్థానంలో ఉంచాలని డిమాండ్‌ చేశారు. అగ్నివీర్‌ పథకాన్ని రద్దు చేయాలని, ఎలాంటి ప్రణాళిక లేని ఇలాంటి తుగ్లక్‌ స్కీముల వల్ల యువత మనోస్థైర్యం దెబ్బతిందని అన్నారు.

నీట్‌పై నాలుగు నోటీసులను తిరస్కరించిన రాజ్యసభ ఛైర్మన్‌
అంతకు ముందు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ నిర్వహించిన నీట్‌ పరీక్షల పేపర్‌ లీక్‌ వ్యవహారంపై ఎంపిలు ఇచ్చిన నాలుగు నోటీసులను రాజ్యసభ చైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖర్‌ తోసిపుచ్చారు. దీనిపై నిష్పాక్షిక విచారణకు ప్రభుత్వం కట్టుబడి ఉందంటూ రాష్ట్రపతి తన ప్రసంగంలో ప్రస్తావించినందున నోటీసులను తిరస్కరిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

➡️