టెస్లాకు ఎర్రతివాచీ

Mar 16,2024 10:07 #Red carpet
  • విదేశీ ఇ-వాహన సంస్థలకు అనుకూలంగా విధానం
  • దిగుమతి సుంకం తగ్గింపు

న్యూఢిల్లీ : అమెరికన్‌ కార్ల కంపెనీ టెస్లాకు మోడీ ప్రభుత్వం తలొగ్గింది. ఆ సంస్థ డిమాండ్‌ చేసినట్లుగా విద్యుత్‌ వాహనాల (ఇవి) పాలసీని రూపొందించింది. దేశంలో ఇవిల తయారీని ప్రోత్సహించేందుకు గానూ కేంద్రం ఇ-వెహికల్‌ పాలసీని తీసుకొచ్చిందని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం వెల్లడించింది. కొత్త పాలసీ ప్రకారం.. భారీ మొత్తంలో దిగుమతి సుంకాన్ని తగ్గించింది. దేశంలో ఏదైనా కంపెనీ కనీసం రూ.4,150 కోట్లు పెట్టుబడిగా పెడితే చాలు పలు రాయితీలు పొందవచ్చు. ఈ రెండు ప్రధానాంశాలు కూడా టెస్లాను దృష్టిలో పెట్టుకుని రూపొందించినట్లు స్పష్టమవుతోంది. కొత్త ఇవి పాలసీ వల్ల భారతీయులకు నూతన తరహా సాంకేతికత అందుబాటులోకి రావడంతో పాటు మేకిన్‌ ఇండియాకు ఊతం లభించనుందని వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. పర్యావరణానికి కూడా మేలు జరుగుతుందని, ముడి చమురు దిగుమతులు తగ్గుతాయని పేర్కొంది.
కాగా.. దేశంలోకి ఎప్పటి నుంచో ప్రవేశించాలని ఎదురు చూస్తున్న టెస్లాకు ఈ పాలసీ వీలు కల్పిస్తోంది. రూ.4,150 కోట్ల పెట్టుబడితో మూడేళ్లలో తయారీ కేంద్రాన్ని నెలకొల్పాల్సి ఉంటుంది. దీంతో పాటు తయారీకి వినియోగించే విడి భాగాల్లో 25 శాతం స్థానికంగానే సమీకరించాల్సి ఉంటుంది. ఈ నిబంధనలు పాటించిన కంపెనీలు 35 వేల డాలర్ల (రూ.29వేలు) కంటే అధిక ధర కలిగిన కార్లను 15 శాతం సుంకంతో ఏటా 8,000 ఇవి కార్ల వరకు దిగుమతి చేసుకోవడానికి ఈ పాలసీ అనుమతిస్తుంది. ప్రస్తుతం కార్ల ధరను బట్టి 70-100 శాతం వరకు దిగుమతి సుంకాలు అమల్లో ఉన్నాయి. దీన్ని టెస్లా తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తోంది. సుంకాలు తగ్గించాలని డిమాండ్‌ చేస్తోంది. దానికి అనుగుణంగా తాజాగా కేంద్ర ప్రభుత్వం పాలసీని రూపొందించడం గమనార్హం. అమెరికాలో టెస్లా తన అతి చౌక ఇవి కారు ధర 38,990 డాలర్లుగా ఉంది. టెస్లా సిఇఒ ఎలన్‌ మస్క్‌ ప్రముఖ సోషల్‌ మీడియా ట్విట్టర్‌ అధినేతగా కూడా ఉన్నారు. ఎన్నికల వేళ టెస్లాకు అనుకూల ఇవి అనుకూల విధానాన్ని రూపొందించడం అనుమానాలకు తావిస్తోంది.

➡️