ఐఐటీలలో తగ్గిన నియామకాలు 

Dec 10,2023 11:14 #economic recovery, #IIIT

 ఆర్థిక మందగమనమే కారణం

న్యూఢిల్లీ :    ప్రపంచవ్యాప్తంగా ఆర్థికాభివృద్ధి నత్తనడక నడుస్తోంది. ఈ వాతావరణం మన దేశంలోనూ కన్పిస్తోంది. ఫలితంగా ప్రతిష్టాత్మక ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీలు)లలో సైతం క్యాంపస్‌ నియామకాలు తగ్గిపోతున్నాయి. ఐఐటీలలో తుది నియామకాల వారం ఈ నెల 1న ప్రారంభమైంది. గత సంవత్సరంతో పోలిస్తే నియామకాలు 15% – 30% మధ్య తగ్గిపోయాయి. నియామకాల ప్రక్రియ ప్రారంభమై వారం రోజులు గడిచినప్పటికీ అనేకమంది విద్యార్థులకు ఇప్పటికీ ఉద్యోగాలు రాలేదు. రాబోయే రోజులలో పరిస్థితి మరింత దారుణంగా ఉండవచ్చునని అంచనా. సాధారణంగా కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సులు చదివే విద్యార్థులకు పలు రకాల ఉద్యోగాలు లభిస్తుంటాయి. వారికి అనేక ఆఫర్‌ లెటర్లు కూడా వస్తుంటాయి. కానీ ఈ సంవత్సరం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. కొందరు విద్యార్థులకైతే ఒక్క ఆఫర్‌ కూడా రాలేదు.

‘8-10 మంది విద్యార్థులను తీసుకునే కంపెనీలు ఇప్పుడు ఒకరిద్దరిని మాత్రమే తీసుకుంటున్నాయి. కొన్ని కంపెనీలు క్యాంపస్‌కు వస్తున్నప్పటికీ ఎవరినీ ఉద్యోగంలోకి తీసుకోవడం లేదు’ అని ఖరగ్‌పూర్‌ ఐఐటీకి చెందిన ఓ విద్యార్థి వాపోయాడు. టెక్నాలజీ, కన్సల్టింగ్‌, ఇతర సేవల రంగాలు సహా పలు రంగాలలో ఆర్థికాభివృద్ధి మందగించడమే ఈ పరిస్థితికి కారణం. ఆర్థిక మార్పిడులు, భౌగోళిక రాజకీయ ఆర్థిక ఆందోళనలు, మాంద్యం భయాలు అంతర్జాతీయంగా ఆర్థిక వృద్ధికి ప్రతిబంధకాలుగా మారాయి. ముఖ్యంగా ఐటీ రంగంలో ఈ పరిస్థితి కొట్టచ్చినట్లు కన్పిస్తోంది. రాబోయే రెండు మూడు త్రైమాసికాలలో కూడా ఇది కొనసాగవచ్చునని ఫౌండిట్‌ జాబ్‌ పోర్టల్‌ (గతంలో మాన్‌స్టర్‌) సీఈఓ శేఖర్‌ గారిస తెలిపారు. ఆటోమొబైల్‌, రిటైల్‌, బ్యాంకింగ్‌ వంటి టెక్నాలజీ యేతర రంగాలు నియామకాలను గణనీయంగా తగ్గించాయి.

పాత ఐఐటీలు ఢిల్లీ, బాంబే, కాన్పూర్‌, మద్రాస్‌, ఖరగ్‌పూర్‌, రూర్కీ, గౌహతి, వారణాసిలో కూడా ఆందోళనకర పరిస్థితులు కన్పిస్తున్నాయి. దేశంలో మొత్తం 23 ఐఐటీలు ఉండగా ఇతర సంస్థల కంటే పాత ఐఐటీలు ఎంతో ప్రతిష్టాత్మకమైనవి. ఈ సంస్థలలో ప్రవేశం పొందాలంటే ఎంతో పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ సంస్థలలో చదివిన విద్యార్థులను ఉద్యోగాలలోకి తీసుకునేందుకు కంపెనీలు పోటీ పడుతుంటాయి. అయితే ఇప్పుడు ఆ వాతావరణం కన్పించడం లేదు. ‘ఇది ఓ చక్రం లాంటిది. గతంలో తాకిడి ఎక్కువగా ఉన్నప్పుడు విద్యార్థులను ఉద్యోగాలలో చేర్చుకునేందుకు కంపెనీలు ఒక దానితో మరొకటి పోటీ పడ్డాయి. ఇప్పుడు వేగం మందగించింది. గతంలో తీసుకున్నంత మంది విద్యార్థులు ఇప్పుడు అవసరమా అని ఇతరులు కూడా ప్రశ్నించుకుంటున్నారు’ మరో విద్యార్థి చెప్పాడు. ఖరగ్‌పూర్‌ ఐఐటీలో ఇప్పటి వరకూ ఏడుసార్లు నియామక ప్రక్రియను నిర్వహించారు. 1,181 మంది విద్యార్థులకు ఆఫర్‌ లెటర్లు అందాయి. గత సంవత్సరం ఇదే సమయంలో 1,300 మందికి ఆఫర్‌ లెటర్లు ఇచ్చారు. ఐఐటీ వారణాసి (బీహెచ్‌యూ) గత సంవత్సరం నాలుగు రోజులలోనే వెయ్యి ఆఫర్‌ లెటర్లు పొందగా ఇప్పుడు 850 లెటర్లు మాత్రమే వచ్చాయి.

➡️