ఆ అడ్డంకులనూ తొలగించండి

  •  మార్కెట్లపై నియంత్రణ ఎత్తేయాలి
  •  ప్రపంచబ్యాంకు ఆదేశాలు
  •  ఉద్యోగ కల్పనలో భారత్‌ విఫలమైందని వ్యాఖ్య

న్యూఢిల్లీ : కార్పొరేట్‌ సంస్థల వ్యాపార విస్తరణకు మిగిలి ఉన్న అడ్డంకులను కూడా తొలగించాలని ప్రపంచబ్యాంకు పేర్కొంది. ఈ మేరకు భారత్‌తో పాటు దక్షిణాసియా దేశాలకు పలు అంశాలపై దిశా నిర్ధేశం చేసింది. ‘సుస్థిరాభివృద్ధి కోసం ఉద్యోగాల సృష్టి’ పేరుతో తాజాగా విడుదల చేసిన దక్షిణాసియా దేశాల ద్వైవార్షిక నివేదికలో ఈ అంశాలను పేర్కొంది. కార్మిక ఉత్పాదకతను పెంచుకోవడానికి అంటూ చేసిన ఈ సూచనల్లో భారతదేశంతో పాటు దక్షిణాసియా దేశాల్లో వ్యాపారాల వృద్ధికి ఇంకా కొన్ని అడ్డంకులు ఉన్నాయని వాటిని పూర్తిగా తెరవాలని పేర్కొంది. అంతర్జాతీయ వాణిజ్యాన్ని మరింత విస్తృతం చేయాలని, కార్మిక మార్కెట్‌లకు ఉన్న పరిమితులను ఎత్తివేయాలని, ఈ దిశలో అవసరమైన మానవవనరులను మరింతగా అందుబాటులోకి తీసుకురావాలని సూచించింది. 2000 సంవత్సరం నుండి ఈ దేశాల్లో కార్మిక మార్కెట్లు క్షీణిస్తున్నాయని నివేదికలో పేర్కొంది. ఉపాధి రంగం పెరగుదల కూడా తగ్గుతోందని, దానిలో మహిళల వాటా చాలా తక్కువగా ఉంటోందని తెలిపింది. మరోవైపు అత్యధికులు వ్యవసాయ రంగంపైనే జీవనోపాధికోసం ఆధారపడుతున్నారని, వ్యవసాయేతర రంగాల్లో ఉద్యోగాలు,ఉపాధి కల్పన తక్కువగా ఉంటోందని నివేదికలో పేర్కొన్నారు. ఈ లక్షణాలతో మిగిలిన అభివృద్ధి చెందుతున్న ఆర్ధిక వ్యవస్థలతో పోలిస్తే దక్షిణాసియా దేశాలు ప్రత్యేకంగా నిలుస్తున్నాయని నివేదిక తెలిపింది.
సంస్కరణలు చేపట్టని పక్షంలో 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఆవతరించాలన్న లక్ష్యాన్ని భారత్‌ సాధించలేదని ప్రపంచబ్యాంక్‌ ప్రధాన ఆర్థికవేత్త (దక్షిణాసియా) ఫ్రాన్‌జిస్కా ఆన్‌సర్జ్‌ తెలిపారు. దీనిని సాధించాలంటే మార్కెట్లపై నియంత్రణ ఎత్తివేయాలని చెప్పారు. ఆసియా దేశాలలో వ్యవసాయ కమతాలు చాలా చిన్న సైజులో ఉన్నాయని, అందువల్ల వ్యవసాయ రంగం ఎక్కువ ఉద్యోగాలను సృష్టించలేదని ఆమె అన్నారు. వ్యవసాయంపై ఆధారపడి ఉన్నవారిని ఇతర రంగాలకు మరల్చాల్సిఉందని చెప్పారు. మార్కెట్ల మీద నియంత్రణలు ఎత్తి వేయడం వ్యవసాయేతర రంగాల అభివృద్ధికి దోహదపడుతుందని, అప్పుడు కొత్త ఉపాధి అవకాశాలు వస్తాయని తెలిపారు.
దక్షిణాసియా ఆర్థిక వ్యవస్థ రాబోయే రెండు సంవత్సరాలలో మరే ఇతర ప్రాంతం సాధించని వృద్ధిని సొంతం చేసుకుంటుందని ప్రపంచబ్యాంక్‌ అంచనా వేసింది. అయితే దాని ఉపాధి నిష్పత్తి మాత్రం తగ్గుతోందని తెలిపింది. అంటే దీనర్థం ఆయా దేశాలు అవసరమైన ఉపాధి అవకాశాలను కల్పించలేకపోతున్నాయన్న మాట. దక్షిణాసియా ప్రాంతం ఈ సంవత్సరం 6 శాతం, వచ్చే సంవత్సరం 6.1 శాతం ఉత్పాదక వృద్ధి సాధిస్తుందని అంచనా. దక్షిణాసియాలో ఉపాధి నిష్పత్తి గత సంవత్సరం 59 శాతంగా ఉంది. ఇతర వర్థమాన దేశాలలో అది 70 శాతంగా ఉండడం గమనార్హం. సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ సంస్థ నివేదిక ప్రకారం గత సంవత్సరం మన దేశంలో యువతలో నిరుద్యోగ రేటు 45.4 శాతంగా ఉంది.
2010 ప్రాంతంలో ఇతర వర్ధమాన దేశాలతో పోలిస్తే భారత్‌లో ఉద్యోగ వృద్ధి బాగా తక్కువగా ఉన్నదని ఆ నివేదిక తెలిపింది. 2000-2022 మధ్యకాలంలో దేశంలో ఉపాధి నిష్పత్తి నేపాల్‌ మినహా ఇతర దక్షిణాసియా దేశాల కంటే బాగా వెనుకబడిందని చెప్పింది. ఉపాధి నిష్పత్తి అంటే ఏదైనా ఒక దేశంలో పనిచేసే వయసున్న ప్రజల సంఖ్యతో ప్రస్తుతం పనిచేస్తున్న వారిని పోల్చడం. మొత్తంమీద 2000-2023 మధ్య ఉపాధి వృద్ధి పనిచేసే వయసున్న ప్రజల సగటు వృద్ధి కంటే బాగా తక్కువగా ఉంది.
దక్షిణాసియా ప్రాంతంలో మాత్రమే గత రెండు దశాబ్దాలుగా పనిచేసే వయసున్న పురుషుల వాటా పడిపోతోందని ప్రపంచబ్యాంక్‌ హెచ్చరించింది. భారత్‌ సహా పలు దక్షిణాసియా దేశాలలో మహిళల ఉపాధి రేటు 40 శాతం కంటే తక్కువగా ఉన్నదని, ఇది ప్రపంచంలోనే అతి తక్కువ రేటని ఎత్తిచూపింది. భారత్‌లో ఆర్థికాభివృద్ధి వేగవంతంగా జరుగుతున్నప్పటికీ సరిపడినంత పని చూపించలేకపోతోందని, నిరుద్యోగం అనేది అక్కడ పెద్ద సమస్యగా తయారైందని తెలిపింది.
అంతర్జాతీయ కార్మిక సంస్థ, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యూమన్‌ డెవలప్‌మెంట్‌ సంయుక్తంగా ‘భారత్‌లో ఉపాధి’పై మార్చిలో ఓ నివేదికను విడుదల చేశాయి. భారత్‌లోని మొత్తం నిరుద్యోగ జనాభాలో నిరుద్యోగ యువత 82.9 శాతం ఉన్నారని ఆ నివేదిక తెలిపింది. సెకండరీ స్థాయి విద్య లేదా ఉన్నత విద్య అభ్యసించిన యువతలో నిరుద్యోగం పెరుగుతోందని వివరించింది. భారత్‌లో 2050 నాటికి మొత్తం జనాభాలో వృద్ధుల సంఖ్య 20 శాతానికి పెరుగుతుందని ఐక్యరాజ్యసమితి గత సంవత్సరం సెప్టెంబరులో తెలియజేసింది. ఈ నేపథ్యంలో నిరుద్యోగ సమస్య పరిష్కారంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని, యువతలో నైపుణ్యాన్ని పెంచాలని, వారి ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని నిపుణులు సూచిస్తున్నారు.

➡️