లిక్కర్‌ స్కాంలో కేసులో కేజ్రీవాల్‌ పేరు చెప్పాకే మాగుంటకు బెయిల్‌ : సంజయ్ సింగ్‌

Apr 5,2024 15:02 #AAP MP, #Sanjay Singh

న్యూఢిల్లీ : లిక్కర్‌ స్కాం కేసులో ఢిల్లీ సిఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ని బిజెపి కుట్రపూరితంగా అరెస్టు చేసిందని ఆప్‌ ఎంపీ సంజయ్ సింగ్‌ ధ్వజమెత్తారు. ఈ కేసులో కేజ్రీవాల్‌ పేరు చెప్పాకే మాగుంట రాఘవకు బెయిల్‌ వచ్చిందని సంజరు అన్నారు. లిక్కర్‌ స్కాం కేసులో ఆరునెలల పాటు తీహార్‌ జైల్లో ఉన్న సంజరుకు సుప్రీంకోర్టు మంగళవారం బెయిల్‌ మంజూరు చేసింది. ఆయన గురువారం రాత్రి బెయిల్‌పై బయటకు వచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘లిక్కర్‌ స్కాం కేసులో కేజ్రీవాల్‌కి వ్యతిరేకంగా ఎలాంటి మనీ ట్రయల్‌ ఆధారాలు లేవు. ఆయన్ని కుట్రపూరితంగానే అరెస్టు చేశారు. మాగుంట శ్రీనివాస్‌రెడ్డి కేజ్రీవాల్‌కి వ్యతిరేకంగా స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. అతని స్టేట్‌మెంట్‌ ఆధారంగానే కేజ్రీవాల్‌ని అరెస్టు చేశారు. కేజ్రీవాల్‌ పేరు చెప్పిన తర్వాతే రాఘవకు బెయిల్‌ ఇచ్చారు. బిజెపితో కలిస్తే ఎవరిపైనా ఎలాంటి కేసులు ఉండవు. ఇప్పుడు మాగుంట శ్రీనివాస్‌కు టిడిపి టికెట్‌ ఇచ్చారు. బిజెపితో పొత్తులో భాగంగానే ఇదంతా జరిగింది. ఆయన ఇప్పుడు మోడీ ఫొటో పట్టుకుని ఓట్లు అడుగుతున్నారు.’ అని కామెంట్స్‌ చేశారు.

కాగా, గురువారం రాత్రి జైలు నుంచి విడుదలైన తర్వాత నేరుగా కేజ్రీవాల్‌ నివాసానికి వెళ్లి ఆయన భార్య సునీతను కలిశారు. అనంతరం ఆ పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ.. ‘మోడీ నియంత పాలనలో దేశమంతా నలిగిపోతోంది. మోడీ సర్కారు ఎంత వేధించినా ఆప్‌ బెదరదు. కేజ్రీవాల్‌ రాజీనామా చేయరు. రెండు కోట్ల మంది ఢిల్లీవాసుల ప్రయోజనాల పరిరక్షణకు జైలు నుంచే సిఎంగా కేజ్రీవాల్‌ విధులు నిర్వర్తిసారు. సిసోడియా, జైన్‌ త్వరలోనే విడుదలవుతారు.’ అని ఆయన అన్నారు.

➡️