త్రిపుర బార్‌ కౌన్సిల్‌ ఎన్నికల్లో ‘సేవ్‌ ది కానిస్టిట్యూషన్‌’ ప్యానెల్‌ విజయం

  •  మితవాదులకు పరాజయం

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : త్రిపుర బార్‌ కౌన్సిల్‌ ఎన్నికల్లో సిపిఎం, కాంగ్రెస్‌ మద్దతు ఉన్న ‘సేవ్‌ది కానిస్టిట్యూషన్‌’ ప్యానెల్‌ ఘన విజయం సాధించింది. బార్‌ కౌన్సిల్‌ అధ్యక్ష, ఉపాధ్యక్ష, కార్యదర్శి స్థానాలకు వరుసగా మృణాల్‌ కాంతి బిశ్వాస్‌, సుబ్రతా దేబ్‌నాథ్‌, కౌశిక్‌ ఇందు ఎన్నికయ్యారు. సహాయ కార్యదర్శులుగా అమర్‌ దెబ్బర్మ, ఉత్పల్‌ దాస్‌ ఎన్నికయ్యారు. ఈఎన్నికల్లో బిజెపి మద్దతు కలిగిన మితవాద ప్యానెల్‌ పరాజయం పాలైంది. మొత్తం 500 మంది ఓటర్లకు గాను 463 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. . మాజీ ముఖ్యమంత్రి, న్యాయవాది సమీర్‌ రంజన్‌ బర్మన్‌, న్యాయవాది శంపా దాస్‌ తమ ఓటు హక్కును వినియోగించుకున్నవారిలో ఉన్నారని రిటర్నింగ్‌ అధికారి సందీప్‌ దత్తా చౌదరి తెలిపారు. త్రిపుర ప్రతిపక్ష నేత, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జితేంద్ర చౌదరి సేవ్‌ కాన్‌స్టిట్యూషన్‌ ఫోరమ్‌ను ఈ సందర్భంగా అభినందించారు. దీనిని కేవలం ఐదు వందల మంది న్యాయవాదుల ఎన్నికగా మాత్రమే చూడరాదు, మన రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తున్న మతోన్మాద బిజెపిపై ఆలోచనా పరులు ఆగ్రహంగా ఉన్నారనడానికి ఇదొక సంకేతం అన్నారు. ఈ విజయం ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో లౌకిక, ప్రజాతంత్ర శక్తులకు ప్రేరణగా నిలుస్తుందన్నారు.
బార్‌ కౌన్సిల్‌ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సిడబ్ల్యుసి) సభ్యుడు సుదీప్‌ రారు బర్మన్‌ హర్షం వ్యక్తం చేశారు. బిజెపి, ఆరెస్సెస్‌ బారి నుంచి దేశాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరాన్ని ఈ తీర్పు తెలియజేస్తోందని అన్నారు.

➡️