పార్లమెంట్‌ భద్రత ఇక ‘సిఐఎస్‌ఎఫ్‌’కు

Dec 22,2023 10:52 #CISF, #Parliament, #Security

న్యూఢిల్లీ : ఇటీవల జరిగిన పార్లమెంట్‌ భద్రతా వైఫల్యం ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. అలాగే ఈ ఘటనతో పార్లమెంట్‌ భద్రత పై అనేక సందేహాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పార్లమెంట్‌ భవన సముదాయంలో సమగ్ర భద్రత బాధ్యతలను సెంట్రల్‌ ఇండిస్టియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (సిఐఎస్‌ఎఫ్‌)కు అప్పగించాలని కేంద్రం నిర్ణయించినట్లు ప్రభుత్వ అధికారులు గురువారం తెలిపారు. అలాగే పార్లమెంట్‌ భవన సముదాయంలో సర్వే చేపట్టాలని కేంద్ర హౌంశాఖ బుధవారం ఆదేశించినట్లు అధికారులు తెలిపారు. ఈ సర్వే అనంతరం పార్లమెంట్‌ ప్రాంగణంలో సిఐఎస్‌ఎఫ్‌ సిబ్బందిని మోహరించనున్నట్లు తెలుస్తోంది. సీఐఎస్‌ఎఫ్‌కు చెందిన గవర్నమెంట్‌ బిల్డింగ్‌ సెక్యూరిటీ (జిబిఎస్‌) యూనిట్‌ నిపుణులు, ఫైర్‌ యూనిట్‌ సభ్యులు ప్రస్తుత పార్లమెంట్‌ భద్రతా సిబ్బందితో కలిసి ఈ వారాంతంలో సర్వే చేపట్టనున్నారు. ఈ ప్రక్రియ అనంతరం.. పాత, కొత్త పార్లమెంట్‌ కాంప్లెక్స్‌లు, వాటి అనుబంధ భవనాలు అన్నింటినీ సీఐఎస్‌ఎఫ్‌ ఆధీనంలోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. దీని కిందే ప్రస్తుతం పార్లమెంట్‌ వద్ద భద్రతను పర్యవేక్షిస్తున్న పార్లమెంట్‌ సెక్యూరిటీ సర్వీస్‌, ఢిల్లీ పోలీసు, సీఆర్పీఎఫ్‌కు చెందిన పార్లమెంట్‌ డ్యూటీ గ్రూప్‌ సిబ్బంది కూడా ఉన్నారు. సీఐఎస్‌ఎఫ్‌ అనేది.. కేంద్ర సాయుధ పోలీసు దళం. ప్రస్తుతం ఈ దళం ఢిల్లీలోని పలు కేంద్ర మంత్రిత్వ శాఖల భవనాలతో పాటు అణు, ఏరోస్పేస్‌ డొమైన్‌, సివిల్‌ ఎయిర్‌పోర్టులు, మెట్రో వద్ద భద్రత కల్పిస్తోంది.

➡️