New Delhi: అంబాలాలో ఘోర ప్రమాదం

  • ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి

ఛండీగఢ్‌ : హర్యానాలోని అంబాలాలో శుక్రవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మందికి పైగా గాయపడ్డారు. అంబాలా- ఢిల్లీ-జమ్ము జాతీయ రహదారిపై వీరు ప్రయాణిస్తున్న మినీ బస్సు, మరో ట్రక్కు ఢీకొనడంతో ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని గాయపడినవారందరినీ అంబాలా కంటోన్మెంట్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌ షహర్‌ నుంచి మినీ బస్సులో ఒకే కుటుంబానికి చెందిన 30 మంది వైష్ణోదేవి క్షేత్రానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో వీరు ప్రయాణిస్తున్న మినీ బస్సు అంబాలా వద్ద మరో ట్రక్కు ఢకొీన్నాయి. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ముగ్గురు మరణించారు. మరో నలుగురు ఆస్పత్రికి తరలించేసరికి ప్రాణాలు కోల్పోయారు. మిగతా 20 మంది అంబాలా కంటోన్మెంట్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ట్రక్కు డ్రైవర్‌ పరారీలో ఉన్నాడని, అతడి కోసం గాలిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.

➡️