పార్లమెంట్‌ స్వతంత్రతపై నీలినీడలు

Dec 12,2023 10:52 #Parliament
  •  ప్రతిపక్ష సభ్యులే లక్ష్యంగా సస్పెన్షన్లు
  • బిజెపి ఎంపీలకు సుతిమెత్తని హెచ్చరికలతో సరి

న్యూఢిల్లీ  :     పార్లమెంట్‌ స్వతంత్రతపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. చట్టసభ నిబంధనలు అధికార పక్షానికి ఒకలా, ప్రతిపక్షాలకు మరోలా వర్తిస్తున్నాయి. అధికార పక్ష సభ్యులు నిబంధనలను తుంగలో తొక్కినా చూసీచూడనట్లు వ్యవహరించడం పరిపాటిగా మారింది. చట్టసభలో నిస్పాక్షికంగా వ్యవహరించి, అందరినీ సమదృష్టితో చూడాల్సిన సభాపతులు అధికార పక్షానికే కొమ్ము కాస్తున్నారు.సెప్టెంబర్‌ 21న బిజెపికి చెందిన లోక్‌సభ సభ్యుడు రమేష్‌ బిధురీ తన సహచరుడైన బిఎస్‌పి ఎంపీ దనిష్‌ అలీపై మతపరమైన దూషణలు చేసి అవమానించారు. సభాపతి ఆయన వ్యాఖ్యలను రికార్డుల నుండి తొలగించి చేతులు దులుపుకున్నారు. బిధురీని సస్పెండ్‌ చేయాలని ప్రతిపక్షాలు ముక్తకంఠంతో డిమాండ్‌ చేసినప్పటికీ సుతిమెత్తగా హెచ్చరించి వదిలేశారు. మరోవైపు బిజెపియేతర సభ్యులు చిన్న చిన్న తప్పిదాలకు పాల్పడినా వారిని సభ నుండి సస్పెండ్‌ చేసిన ఉదంతాలు ఇటీవలి కాలంలో చోటుచేసుకుంటున్నాయి.

ఉదాహరణకు కాంగ్రెస్‌ సభ్యుడు అధిర్‌ రంజన్‌ చౌదరి సభలో మహాభారతాన్ని ప్రస్తావిస్తూ ‘మహిళలకు వ్యతిరేకంగా జరుగుతున్న అకృత్యాల విషయంలో రాజు గుడ్డివాడిగా ఉండకూడదు. అది హస్తినాపూర్‌లో కావచ్చు. మణిపూర్‌లో కావచ్చు’ అని వ్యాఖ్యానించారు. చౌదరి ఉద్దేశపూర్వకంగా, తరచూ దుష్ప్రవర్తనకు పాల్పడుతున్నారంటూ ఆయనను సభ ఆగస్ట్‌ 10న సస్పెండ్‌ చేసింది. అదే నెల 30న ప్రివిలేజ్‌ కమిటీ ఆ సస్పెన్షన్‌ను ఎత్తివేయడం వేరే విషయం. అంతకుముందు జులై 24న రాజ్యసభలో ఆమ్‌ఆద్మీ సభ్యుడు సంజరు సింగ్‌ను చైర్మెన్‌ జగదీప్‌ ధన్‌కర్‌ సస్పెండ్‌ చేశారు. ఇంతకీ ఆయన చేసిన మహాపరాధం ఏమిటంటే ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేస్తుండగా సభ మధ్యలోకి దూసుకుపోయి సభాపతి స్థానం వైపు వేలెత్తి చూపడం.

➡️