ఎన్‌కౌంటర్‌ ప్రాంతంలో రాజ్యమేలుతున్న మౌనం !

Apr 18,2024 00:32 #encounter
  •  చెట్లపై బుల్లెట్‌ గుర్తులు
  • నోరు విప్పని గ్రామస్తులు

కాంకర్‌ : ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్రలోని మూడు జిల్లాల సరిహద్దుల్లో మంగళవారం తెల్లవారుజామున ఎన్‌కౌంటర్‌ జరిగిన తర్వాత ఆ ప్రాంతమంతా మౌనం రాజ్యమేలుతోంది. ఎన్‌కౌంటర్‌ జరిగి ఇన్ని గంటలు గడిచినా బుధవారానికి కూడా ఆ ప్రాంతంలోని చెట్లపై బుల్లెట్‌ గుర్తులు కనిపిస్తున్నాయి. ఆ ప్రాంతంలోని నేలపై రక్తం మరకల తడి ఆరలేదు. నేలకు రాలిన వెదురు ఆకులు దట్టంగా పచ్చిక మాదిరిగా నేలను కప్పుతున్నాయి. ఆ సమీప గ్రామాల ప్రజలైన స్థానిక గిరిజనులు, ఎక్కువ మంది మహిళలే, బయటకు కనిపిస్తున్నారు. కానీ ఎన్‌కౌంటర్‌ సమయంలో వారు చూసిందీ, విన్నది చెప్పడానికి సుముఖంగా లేరు. ఆ ప్రాంతంలోని అకమెటా గ్రామ వాసి లింగారామ్‌ మాట్లాడుతూ.. తన కజిన్‌ సుక్కు ఈ ఎన్‌కౌంటర్‌లో చనిపోయాడని విలేకర్లకు తెలిపారు. ఆ విషయం బుధవారమే తెలిసిందన్నారు. సుక్కు మృతదేహం కోసం వారి కుటుంబం పోలీసులను కలవాల్సి వుందన్నారు. ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రాంతానికి వెళ్ళే మార్గమంతా ఎగుడు దిగుడు రోడ్లతో, పలుచోట్ల తవ్వేసి వుంది. లోక్‌సభ ఎన్నికలను బహిష్కరించాలని ప్రజలకు పిలుపిస్తూ వేసిన నక్సలైట్ల పోస్టర్లు చెల్లాచెదురుగా పడి వున్నాయి. మరణించిన నక్సలైట్లకు చెందిన వస్తువులు ఆ ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి. మంగళవారం తెల్లవారుజామున తుపాకీ మోతలు వినిపించాయని మాత్రమే మరో గ్రామస్తుడు తెలిపారు. అంతకుమించి వివరాలు వెల్లడించడానికి ఇష్టపడలేదు. దట్టమైన వెదురు చెట్లతో నిండిన ఆ ప్రాంతంలో ఖాళీ సిరంజీలు, సాఫ్ట్‌ డ్రింక్‌ బాటిళ్ళు, గాయపడిని వారిని మోసుకెళ్ళేందుకు భద్రతా సిబ్బంది ఉపయోగించే తాత్కాలిక స్ట్రెచర్లు పడి వున్నాయి. ఎన్‌కౌంటర్‌ నాలుగు గంటల పాటు సాగింది.

➡️