బిజెపి ఎంపీల కార్యాలయాలు, నివాసాల వద్ద ఎస్‌కెఎం ఆందోళన

Feb 22,2024 10:35 #bjp ofice, #SKM concern

 ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కేంద్ర ప్రభుత్వం 2020లో రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం బిజెపి, దాని నేతృత్వంలోని ఎన్‌డిఎ భాగస్వామ్య పార్టీలకు చెందిన ఎంపిలకు వ్యతిరేకంగా సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కెఎం) ఆధ్వర్యంలో రైతులు ఆందోళనలు చేపట్టారు. ఉత్తరప్రదేశ్‌, హిమాచల్‌, హర్యానా, పంజాబ్‌, మధ్యప్రదేశ్‌ వంటి రాష్ట్రాల్లో బిజెపి ఎంపీల కార్యాలయాలు, నివాసాల వద్ద చేపట్టిన ఆందోళనల్లో రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పలుచోట్ల బిజెపి నేతల దిష్టి బొమ్మలను దగ్ధం చేశారు. అన్ని పంటలకు చట్టపరమైన కనీస మద్దతు ధర డిమాండ్‌పై రైతుల ఆందోళన తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో గురువారం ఢిల్లీలో జరగనున్న సంయుక్త కిసాన్‌ మోర్చా సమావేశం కీలక నిర్ణయాలు తీసుకోనుంది. 2020లో చారిత్రాత్మక రైతుల పోరాటానికి నాయకత్వం వహించిన ఎస్‌కెఎం, ప్రస్తుత రైతుల ఆందోళనలపై సమీక్షించి తదుపరి ఉద్యమ కార్యచరణను రూపొందించనుంది. దేశవ్యాప్తంగా రైతులంతా ఐక్య వేదికగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని ఎస్‌కెఎం పేర్కొంది. హర్యానా-పంజాబ్‌ సరిహద్దులో రైతులపై పోలీసుల దాడి, కనౌరిలో యువ రైతు హత్యపై ఎస్‌కెఎం తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. పోలీసు చర్యలను ఖండించింది. దేశవ్యాప్తంగా ఆందోళనకు పిలుపు ఇచ్చింది.

➡️