ఉద్యోగ కల్పనపై కహానీలు

May 23,2024 01:30 #modi, #speech

యువతకు అనేక అవకాశాలు కల్పించామన్న మోడీ
అదేమీ లేదన్న యువతరం
ఖాళీల భర్తీపై ఆసక్తి చూపని ప్రభుత్వం
8 శాతానికి చేరిన నిరుద్యోగ రేటు
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 20న పీటీఐ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇస్తూ నిరుద్యోగ సమస్యను ప్రస్తావించారు. ‘గత ప్రభుత్వాలతో పోలిస్తే మా ప్రభుత్వం యువతకు అనేక అవకాశాలు కల్పించింది. అది మా ట్రాక్‌ రికార్డ్‌’ అని ఆయన చెప్పుకున్నారు. అయితే లోక్‌నీతి-సీఎస్‌డీఎస్‌ ఇటీవల జరిపిన సర్వే సందర్భంగా అనేక మంది నిరుద్యోగం, ధరల పెరుగుదలపై తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేశారు. ‘గత ఐదు సంవత్సరాలతో పోలిస్తే ఇవాళ ఉద్యోగాలు పొందడం సులభమని మీరు భావిస్తున్నారా? కష్టమని అనుకుంటున్నారా?’ అని అడిగిన ప్రశ్నకు ఇప్పుడు ఉద్యోగాలు సంపాదించడం కష్టంగా ఉన్నదని 62% మంది స్పష్టం చేశారు.

పెరగడమే కానీ తగ్గింది లేదు
సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ (సిఎంఐఈ) సంస్థ నివేదిక ప్రకారం 2023-24లో 15 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయసున్న వారిలో నిరుద్యోగ రేటు 8%గా ఉంది. అంతకుముందు రెండు సంవత్సరాల్లో ఈ రేటు 7.5-7.7% మధ్య నమోదైంది. ఉద్యోగాల కోసం వెతుకుతున్న నిరుద్యోగుల సంఖ్య 3.7 కోట్లకు చేరింది. గత ఏడు సంవత్సరాల్లో నిరుద్యోగ రేటు 8% పైగానే నమోదవుతోంది. 15-64 సంవత్సరాల మధ్య వయసున్న వారిలో పనిచేస్తున్న కార్మికుల రేటు (ఎల్‌పిఆర్‌) 2016-17లో 46.2%గా ఉండేది. అయితే ఆ తర్వాతి మూడు సంవత్సరాల్లో ఈ రేటు 42-44%కి పడిపోయింది. 2020-21లో ఇది మరింత తగ్గి 40%కి చేరింది. అప్పటి నుండి ఈ రేటు తగ్గుతూనే ఉంది. 2023-24లో 40.4%గా ఉన్న ఎల్‌పీఆర్‌ రేటు 2016-17తో పోలిస్తే 5.8 పర్సంటేజ్‌ పాయింట్లు తగ్గింది. దీనిని బట్టి అర్థమవుతోంది ఏమంటే దేశంలో నిరుద్యోగ రేటు పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు.

45 సంవత్సరాల గరిష్ట స్థాయికి…
2019లో దేశంలో నిరుద్యోగం 45 సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరుకుంది. అయితే ఈ వాస్తవాన్ని మోడీ ప్రభుత్వం బయటికి పొక్కనివ్వలేదు. ప్రభుత్వ చర్యను నిరసిస్తూ ఇద్దరు అధికారులు రాజీనామా కూడా చేశారు. కార్మిక మంత్రిత్వ శాఖ 2019లో విడుదల చేసిన వివరాల ప్రకారం 2017ా18లో నిరుద్యోగ రేటు 6.1%గా ఉంది. ప్రభుత్వం ఎంతగా తొక్కిపట్టినప్పటికీ 2017 జూలైా2018 జూన్‌ కాలానికి సంబంధించిన పీరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే (పీఎల్‌ఎఫ్‌ఎస్‌) నివేదిక బయటికి వచ్చింది. నిరుద్యోగం భయానక స్థాయికి చేరిందని, గత 45 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంతగా నిరుద్యోగం పెరిగిందని ఆ నివేదిక బయటపెట్టింది.

పొరుగు దేశాలతో పోలిస్తే…
ఇక యువతలో నిరుద్యోగ రేటు విషయానికి వస్తే అది దక్షిణాసియాలోని పొరుగు దేశాల్లో కంటే అధికంగా ఉంది. 2022లో విడుదలైన ప్రపంచబ్యాంక్‌ నివేదిక ప్రకారం మన దేశంలోని యువతలో నిరుద్యోగ రేటు 23.22%గా నమోదైంది. ఇది పాకిస్తాన్‌ (11.3%), బంగ్లాదేశ్‌ (12.9%), భూటాన్‌ (14.4%) దేశాల్లో రేటు కంటే చాలా ఎక్కువ. అదే సంవత్సరం చైనాలో నిరుద్యోగ రేటు 13.2%గా ఉంది.

యువతే అధికం
నిరుద్యోగుల్లో యువతే అధికంగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. 2022లో దేశంలోని మొత్తం నిరుద్యోగుల్లో నిరుద్యోగ యువత 82.9%గా ఉన్నారు. భారత్‌లో నిరుద్యోగ సమస్య యువతలోనే అధికంగా ఉన్నదని, ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లోని విద్యావంతులైన యువత, మహిళల్లో ఇది ఎక్కువగా ఉన్నదని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) తన తాజా నివేదికలో తెలిపింది. మొత్తం నిరుద్యోగుల్లో విద్యావంతులైన యువత వాటా 2000లో 11.5% ఉంటే 2022 నాటికి 65.7%కి పెరిగింది. విద్యావంతులైన (సెకండరీ స్థాయి లేదా ఆ పైన) నిరుద్యోగ యువతలో పురుషుల (62.2%) కంటే మహిళలే (76.7%) ఎక్కువగా ఉన్నారు.

ఖాళీలూ రికార్డు స్థాయిలోనే…
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఖాళీల సంఖ్య రికార్డు స్థాయికి చేరింది. వాటిని భర్తీ చేయకపోగా అకస్మాత్తుగా రద్దు చేస్తున్నారు. సురక్షితమైన, గౌరవనీయమైన ఉపాధిని కల్పిస్తున్న సాయుధ దళాల్లో అగ్నివీర్‌ పేరిట నాలుగు సంవత్సరాల కాంట్రాక్ట్‌ సైనిక పథకాన్ని తీసుకొచ్చారు. ఈ అంశాన్ని ప్రధాని మోడీ తన ఎన్నికల ప్రచారంలో ఎక్కడా ప్రస్తావించడం లేదు. అధికారంలోకి వస్తే ఈ పథకాన్ని రద్దు చేస్తామని ప్రతిపక్షాలు హామీ ఇచ్చాయి. ఉద్యోగ నియామకాల కోసం నిర్వహించే పరీక్షల్లో అనేక అవకతవకలు జరగడం యువతలో అగ్రహాన్ని కలిగిస్తోంది. ముఖ్యంగా పరీక్షా పత్రాలు లీక్‌ అవడం పరిపాటిగా మారింది. వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో 10 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ విషయాన్ని ప్రభుత్వమే లోక్‌సభలో అంగీకరించింది. ఇదిలావుంటే ఐటీ రంగంలో ఉద్యోగాల్లో భారీ కోత పడుతోంది. నియామకాల సంస్థ ఫౌండిట్‌ తెలిపిన వివరాల ప్రకారం హార్డ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్‌ ఐటీ కోసం ఆన్‌లైన్‌ నియామక కార్యకలాపాలు గత సంవత్సరం 18% మేర తగ్గిపోయాయి.

➡️