పంజాబ్‌ ముఖ్యమంత్రిపై శిరోమణి అకాలీదళ్‌ చీఫ్‌ సంచలన వ్యాఖ్యలు

చంఢీఘర్    :       పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌మాన్‌పై శిరోమణి అకాలీదళ్‌ అధ్యక్షుడు సుఖ్బీర్‌ సింగ్‌ బాదల్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ” భగవంత్‌మాన్‌కు సిక్కుల చరిత్ర తెలియదు. దీంతో ఆయనను సిక్కుగా పరిగణించడంలేదు” అని అన్నారు. సోమవారం సాయంత్రం ఢిల్లీలో సిక్కు గ్రూపులతో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ” భగవంత్‌ మాన్‌ సిక్కుగా కనిపించేందుకు తలపాగా ధరిస్తాడు. అతనికి సిక్కుల చరిత్ర గురించి తెలియదు. ఆయన ప్రకటనలు చూసినపుడు మాకు బాధగా ఉంది ” అన్నారు.

” దేశంలో ముస్లిం జనాభా 18 శాతం ఉన్నా ఐక్యంగా లేనందున వారికి నాయకత్వం లేదు. మేము 2 శాతం ఉన్నా అకల్‌ తఖ్త్‌ సాహిబ్‌ కింద ఐక్యంగా ఉన్నాము ” అన్నారు. పంజాబ్‌ ప్రభుత్వాన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్‌ కన్వీనర్‌ కేజ్రీవాల్‌ నడిపిస్తున్నారని, వారు (ఆప్‌) పంజాబ్‌ను దోచుకుంటున్నారని ఆరోపించారు. పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ కాదని, కేజ్రీవాల్‌ అని అన్నారు. అన్ని రాష్ట్రాల్లో శిరోమణి అకాలీ దళ్‌ పార్టీ యూనిట్లను ఏర్పాటు చేస్తుందని అన్నారు. సిక్కు సమాజం పలు సవాళ్లను ఎదుర్కొంటోందని, అన్ని యూనిట్లను శిరోమణి అకాలీ దళ్‌ జెండా కింద ఐక్యం చేస్తేనే పరిష్కరించుకోగలమని అన్నారు.

➡️