అంత ప్రతికూలత ఎందుకు?

Jan 18,2024 10:15 #Hate Speech, #speech, #Supreme Court
అంత ప్రతికూలత ఎందుకు?

విద్వేష ప్రసంగాల నిరోధంపై ప్రశ్నించిన సుప్రీం కోర్టు

న్యూఢిల్లీ : విద్వేష ప్రసంగాలు పునరావృతం కాకుండా నిలువరించేందుకు పోలీసులు, స్థానిక అధికారులు తీసుకునే చర్యలను ఎందుకు అంత ప్రతికూలంగా చూస్తున్నారో చెప్పాలంటూ సుప్రీం కోర్టు బుధవారం పిటిషనర్లను కోరింది. షహీన్‌ అబ్దుల్లా తరపున వాదనలు వినిపిస్తున్న సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ మాట్లాడుతూ, సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలతో విద్వేష ప్రసంగాలు ఆగలేదన్నారు. అలా మాట్లాడిన వారు ఎలాంటి శిక్షలు లేకుండా తప్పించుకుంటున్నారన్నారు. చాలా కేసుల్లో పోలీసు అధికారులు మౌన ప్రేక్షకుల్లా చూస్తూ వూరుకుండిపోతున్నారన్నారు. ఈ విషయంలో తక్షణమే సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని కోరారు. గతంలో విద్వేష ప్రసంగాలపై అధికారులు చర్యలు తీసుకున్నారని జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తాలతో కూడిన బెంచ్‌ పేర్కొంది.

కోర్టు జారీ చేసిన ఆదేశాలతో పరిస్థితులు కొంత మారాయన్నారు. దాన్ని ఎందుకు ప్రతికూలంగా చూస్తున్నారని కోర్టు ప్రశ్నించింది. ”మేం దాన్ని వ్యతిరేకంగా చూడడం లేదని, భవిష్యత్‌ గురించి ఆందోళన చెందుతున్నాం” అని సిబల్‌ చెప్పారు. సిబల్‌ క్లయింట్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై బెంచ్‌ విచారణ జరిపింది. హిందూ జనజాగృతి సమితి నిర్వహిస్తున్న పలు కార్యక్రమాల్లో వక్తలు బహిరంగంగానే ముస్లింలను చెడ్డగా చిత్రీకరిస్తూ,, వారిని బహిష్కరించాల్సిందిగా పిలుపిస్తున్నారని ఆ పిటిషన్‌ పేర్కొంది. చివరగా జనవరి 3వ తేదీన మహారాష్ట్ర షోలాపూర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ముస్లింలను లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు చేశారని సిబల్‌ పేర్కొన్నారు. హిందూ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనే పిలుపుతో తిరిగి జనవరి 7వ తేదీన కూడా అదే సంస్థ అనేక కార్యక్రమాలను నిర్వహించిందన్నారు. ముస్లింలు లవ్‌ జిహాద్‌లకు పాల్పడుతున్నారంటూ ప్రజల్లో ప్రచారం కల్పించాలనే పేరుతో అనేక పుస్తకాలను ప్రచురించారన్నారు. గురువారం (18న) మహరాష్ట్రలోని యవత్మాల్‌లో బహిరంగ కార్యక్రమాలు నిర్వహించాలని కూడా ఈ సంస్థ ప్రణాళిక వేసిందని సిబల్‌ పేర్కొన్నారు. అటువంటి కార్యక్రమాలకు అనుమతి ఇవ్వకుండా రాష్ట్రాల్లోని అధికారులను ఆదేశించాలని ఆయన సుప్రీం కోర్టును కోరారు. పిటిషన్‌లో పేర్కొన్న వ్యక్తులు సుప్రీం కోర్టులో పక్షాలుగా హాజరయ్యారా అని జస్టిస్‌ దత్తా, సిబల్‌ను ప్రశ్నించారు. ‘వారిని విచారించకుండానే మేం ఆదేశాలు జారీ చేయాలని మీరనుకుంటున్నారా? విచారణకు కూడా కొన్ని ప్రాధమిక సూత్రాలుంటాయి.’ అని అన్నారు. రక్షణ కల్పించాల్సిన ప్రాథమిక హక్కులు కూడా వుంటాయని సిబల్‌ అన్నారు.

➡️