మద్రాసు హైకోర్టు నిర్ణయం సరైనదే !

మంత్రిగా సెంథిల్‌ బాలాజీ కొనసాగింపుపై ముఖ్యమంత్రే నిర్ణయం తీసుకోవాలన్న సుప్రీం కోర్టు

న్యూఢిల్లీ : ఎలాంటి శాఖ కేటాయించకుండా మంత్రిగా వి.సెంథిల్‌ బాలాజీని కొనసాగించడంపై నిర్ణయించుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌దేనంటూ ఈ విషయంపై తాను ఎలాంటి ఆదేశాలు జారీ చేయకుండా, బంతిని ముఖ్యమంత్రి కోర్టులోకే నెడుతూ మద్రాసు హైకోర్టు తీసుకున్న వైఖరి సరైనదేనని సుప్రీం కోర్టు శుక్రవారం పేర్కొంది. ఉద్యోగం కోసం ముడుపులు కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్‌ కేసు మంత్రి సెంథిల్‌ బాలాజీపై నమోదైంది. ”ఆదేశాలు సరైనవే.. మద్రాసు హైకోర్టు తీసుకున్న నిర్ణయంతో మేం ఏకీభవిస్తున్నాం. ఎలాంటి జోక్యం అవసరం లేదు. పిటిషన్‌ డిస్మిస్‌ చేయబడింది.” అని బెంచ్‌కు నేతృత్వం వహిస్తున్న జస్టిస్‌ ఎఎస్‌ ఓఖా పిటిషనర్‌ ఎం.ఎల్‌ రవిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. సెంథిల్‌ బాలాజీని ప్రభుత్వంలో కొనసాగించేందుకు గల అవకాశాలపై నిర్ణయం తీసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రిని హైకోర్టు కోరింది. ”పోర్టుఫోలియో లేకుండా ఒక మంత్రిని ప్రభుత్వంలో కొనసాగించడం రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమే… రాజకీయ ఒత్తిళ్ళు అనేవి ప్రజల నైతికత, సుపరిపాలన లేదా స్వచ్ఛమైన పాలన, రాజ్యాంగ నైతికత ప్రమాణాల కన్నా ఎక్కువేమీ కాదు.” అని వ్యాఖ్యానించింది. మంత్రిని ఏకపక్షంగా డిస్మిస్‌ చేసే విచక్షణాధికారం గవర్నర్‌కి లేదని హైకోర్టు చేసిన వ్యాఖ్యలతో జస్టిస్‌ ఓఖా కూడా ఏకీభవించారు. ఒక మంత్రికి సంబంధించి తాను సంతృప్తి చెందడం లేదని గవర్నర్‌ భావించినట్లైతే, ముందుగా ముఖ్యమంత్రిని సంప్రదించాకే తన విచక్షణాధికారాలను ఉపయోగించుకోవాలి. అంతేకానీ ఏకపక్షంగా చేయరాదు. ప్రస్తుత కేసులో, ముఖ్యమంత్రి సమ్మతిని తీసుకునే ప్రయత్నం గవర్నర్‌ ఎన్నడూ చేయలేదు” అని మద్రాసు హైకోర్టు తన సెప్టెంబరు 5 నాటి ఉత్తర్వుల్లో పేర్కొంది. తొలుత సెంథిల్‌ బాలాజీని విద్యుత్‌, ఎక్సైజ్‌ శాఖ మంత్రిగా తొలగిస్తూ తక్షణమే అమల్లోకి వచ్చేలా గతేడాది జూన్‌ 29న ఆదేశాలు జారీ చేసిన గవర్నర్‌ కొద్ది గంటల వ్యవధిలోనే మొదట జారీ చేసిన ఆదేశాలను నిలుపు చేస్తూ రెండోసారి ఆదేశాలు జారీ చేశారు. గవర్నర్‌ ఆదేశాలను రవి సవాలు చేశారు. మంత్రి తొలగింపును నిలుపుచేస్తూ గవర్నర్‌ తీసుకున్న నిర్ణయం ఏకపక్షమని, రాజ్యాంగాన్ని తీవ్రంగా ఉల్లంఘించడమేనని రవి పేర్కొన్నారు. ”గవర్నర్‌గా బాధ్యతలు నిర్వరిస్తున్న ఆయన తన ఆదేశాలను వెనక్కి తీసుకోలేరు. మంత్రిని తొలగించాలంటూ ఆదేశించడానికి బదులుగా హైకోర్టు కేవలం మంత్రి విషయంలో నిర్ణయం తీసుకోవాలంటూ మాత్రమే ముఖ్యమంత్రికి సూచించింది.” అని పిటిషనర్‌ తన పిటిషన్‌లో వాదించారు. సెంథిల్‌ బాలాజీ శాఖలను ఆర్ధిక మంత్రి తంగమ్‌ తెన్నరసుకి బదలాయిస్తూ, బాలాజీని పోర్టుఫోలియో లేని మంత్రిగా కొనసాగించాలని కోరుతూ ముఖ్యమంత్రి, గవర్నర్‌కు గతేడాది జూన్‌ 16న లేఖ రాయడంతో ఈ ప్రహసనం ఆరంభమైంది. అదే రోజు గవర్నర్‌ తెన్నరసుకి శాఖలను బదలాయించారు. కానీ సెంథిల్‌ బాలాజీ క్రిమినల్‌ ప్రొసీడింగ్స్‌ను ఎదుర్కొంటున్నందున మంత్రిగా కొనసాగించడాన్ని వ్యతిరేకించారు. అదే రోజు సెంథిల్‌ బాలాజీ శాఖలు వేరే వారికి కేటాయించబడ్డాయని, ఆయన ఎలాంటి పోర్టుఫోలియో లేకుండా మంత్రిగా కొనసాగుతారంటూ రాష్ట్ర ప్రభుత్వం ఒక పత్రికా ప్రకటన జారీ చేసింది. దీంతో గవర్నర్‌ జూన్‌ 29న మంత్రి బాలాజీని తొలగిస్తూ తొలుత ఆదేశాలు జారీ చేయడం, ఆ వెంటనే వాటిని నిలుపుచేస్తూ రెండోసారి ఆదేశాలు జారీ చేయడం జరిగాయి.

➡️