తమిళనాట డిఎంకె కూటమిదే హవా

  • పుదుచ్చేరి సహా 40 స్థానాల్లో విజయావకాశాలు
  • మూడో స్థానానికే బిజెపి పరిమితం
  • రేపటితో ముగియనున్న ఎన్నికల ప్రచారం

ప్రజాశక్తి – మదురై : తమిళనాడు లోక్‌సభ ఎన్నికల్లో డిఎంకె కూటమి (ఇండియా అలయన్స్‌)దే హవా కనిపిస్తుంది. పుదిచ్చేరిలోని ఒకటి, తమిళనాడులోని 39 లోక్‌సభ స్థానాల్లోనూ ఆ కూటమికే విజయావకాశాలు కనిపిస్తున్నాయని ఇంటిలిజెన్స్‌ నివేదిక. తమిళనాడులో మూడు కూటముల మధ్య ప్రధాన హోరు ఉన్నప్పటికీ హోరాహోరీ మాత్రం డిఎంకె, అన్నా డిఎంకె కూటముల మధ్యనే పోటీ నెలకొంది. తమిళనాడులో తమ బలం పెరిగిందని, రెండో స్థానంలో నిలుస్తామని చెబుతున్న బిజెపి ఆచరణలో మూడో స్థానమే దక్కనుంది. ఈనెల 17వ తేదీన తమిళనాడులో ఎన్నికల ప్రచారం ముగియనుంది. 19న పోలింగ్‌ జరగనుంది.

డిఎంకె కూటమికి విజయావకాశాలు
తమిళనాడులో 39 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. 21 స్థానాల్లో డిఎంకె, 9 స్థానాల్లో కాంగ్రెస్‌, 2 స్థానాల్లో సిపిఎం, రెండిట్లో సిపిఐ, రెండిట్లో విసికె, ఎండిఎన్‌కె ఒకటి, ఇండియన్‌ ముస్లీం లీగ్‌ ఒకటి, కొంగునాడు పీపుల్స్‌ పార్టీ ఒకటి బరిలో ఉన్నాయి. పుదుచ్చేరికి కూటమినుంచి కాంగ్రెస్‌ పోటీ చేస్తోంది. కూటమికి 60 పైనే దళిత బడుగు బలహీనవర్గాల, కార్మిక ప్రజాసంఘాలు మద్దతుగా ఉన్నాయి. మదనయం మస్కల్‌ కట్చి, ఫార్వర్డ్‌ బ్లాక్‌, రైతు, వ్యాపార సంఘాలు వెన్నుదన్నుగా నిలిచాయి. తమిళనాడులో అతి పెద్ద వ్యాపార సంఘాలైన లెట్‌బై వైలయన్‌, విక్రమ్‌ రాజాలు మద్దతుగా ఉన్నాయి. మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన నోట్లరద్దు, జిఎస్‌టి వల్ల పెద్దమొత్తంలో నష్టపోతుండం వల్ల పెద్దఎత్తున డిఎంకె కూటమికి సపోర్టుగా నిలిచారని తెలుస్తోంది. చిన్న పరిశ్రమలు సైతం భాగస్వామ్యమయ్యాయి. కర్నాటకలో బిజెపి అధికారంలో ఉన్నపుడు కావేరి – డెల్టా నీళ్లను అడ్డుకుని తమిళనాడు రాష్ట్రం తంజావూరు, తిరువారూరు, నాగపట్నం ప్రాంతాల్లోని ఆయకట్టు రైతులను ఇబ్బంది పెట్టారు. కర్నాటకలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ సమస్య పరిష్కారం కావడమూ వీరికి కలిసొచ్చిన అంశం. రాష్ట్రంలోని అతి పెద్ద సంఘమైన రచయితల సంఘం సైతం వీరికి బాసటగా నిలిచింది. 2021లో అధికారం చేపట్టిన డిఎంకె అధినేత, ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఉచిత సంక్షేమ పథకాలు కూటమి విజయానికి కలిసిరానుంది. మక్కల్‌ మీది మయ్యమ్‌ వ్యవస్థాపక అధ్యక్షులు, ప్రముఖ సినీ హీరో కమల్‌హాసన్‌ డిఎంకె కూటమికి సపోర్టుగా ఉన్నారు. ఎన్నికల ప్రచార సభల్లోనూ, రోడ్డుషోలలోనూ పాల్గొంటున్నారు. ప్రజా స్వామ్యాన్ని పరిరక్షించాలంటే డిఎంకెకు ఓట్లేయాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. మరో సినీ నటి (రఘువరన్‌ భార్య) రోహిణి మద్దతుగా ప్రచారాల్లో పాల్గొంటున్నారు.

బిజెపి విధానాలపై నోరువిప్పని అన్నాడిఎంకె
మొన్నటివరకూ బిజెపితో అంటకాగిన అన్నాడిఎంకె ఎన్నికలకు ముందు బయటకొచ్చింది. అధికారంలో ఉన్నపుడు గ్రూపుల రాజకీయంతో ప్రజా సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యింది. అన్నాడిఎంకె వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ యడపడి పళనిస్వామి బిజెపి తమిళవాసులకు ఇచ్చిన హామీలను పరిష్కరించాలని ఒక్కరోజైనా నిలదీసిన దాఖలా లేదు. ప్రస్తుత ఎన్నికల ప్రచారంలోనూ బిజెపిని ఒక్కమాట కూడా అనకుండా అధికార పార్టీ అయిన డిఎంకె పైనే విమర్శలు చేస్తోంది. డిఎండికెతో పొత్తు కుదుర్చుకుని కూటమిగా మారింది. 33 స్థానాల్లో అన్నాడిఎంకె, డిఎండికె ఐదు స్థానాల్లో పోటీ చేస్తోంది. మరో చిన్న పార్టీ ఒక స్థానంలో పోటీ చేస్తోంది. అన్నాడిఎంకె అధికారంలో ఉన్నపుడు కూచిపుడిలో స్టైర్‌లైట్‌ కంపెనీకి అమ్ముడుపోయి 13 మంది కార్మికులను పొట్టన పెట్టుకుంది. అదే కంపెనీ నుంచి అన్నాడిఎంకె ద్వారా బిజెపికి ఎలక్ట్రానిక్‌ బాండ్‌ ద్వారా పెద్దమొత్తంలో ముట్టచెప్పింది. అన్నాడిఎంకె కూటమిని తమిళనాడు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని రాజకీయ విశ్లేషకుల భావన.

ఒక్క వాగ్దానం నెరవేర్చని బిజెపి
2022కు ముందు అన్నాడిఎంకెతో సయోధ్య కుదుర్చుకుని బిజెపి ఇచ్చిన హామీలేవీ ఒక్కటీ అమలు కాలేదు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఈ మూడేళ్లకాలంలో ఎనిమిదిసార్లు తమిళనాడుకు వచ్చారు. అనేక వాగ్దానాలు చేశారు. ఒక్కటీ నెరవేర్చలేదు. మధురైలో ఎయిమ్స్‌ ఆస్పత్రిని రూ.1500 కోట్లతో నిర్మిస్తామని చెప్పినా బడ్జెట్‌లో పైసా కూడా విదల్చలేదు. తమిళనాడుకు భారీ పరిశ్రమలు తెచ్చి యువతకు ఉపాధి కల్పిస్తామని చెప్పినా చేయలేదు. చెన్నరు మెట్రోరైలును కేంద్ర నిధులతో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అయితే రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే మెట్రోరైలు పూర్తయ్యింది. ఆరేళ్లక్రితం చెన్నరుకి తుపాను వచ్చింది. కూచిపుడి, తిరువన్‌వేలి ప్రాంతాల్లో పూర్తిగా కొట్టుకుపోయి ఆస్తినష్టం వాటిల్లింది. పిఎం రిలీఫ్‌ ఫండ్‌ కింద రూ.38వేల కోట్లు సిఎం స్టాలిన్‌ కేంద్రాన్ని కోరారు. కేంద్రమంత్రులు రాజ్‌నాధ్‌సింగ్‌, నిర్మలా సీతారామన్‌ సందర్శించి వెళ్లారు. ఒక్క పైసా సాయం చేయలేదు. ముఖ్యమంత్రి స్టాలిన్‌ ప్రతి మహిళకు వెయ్యి రూపాయలు ఆర్థిక సాయం చేస్తుంటే, తమిళనాడు మహిళలు బిక్షమెత్తుకుంటున్నారని బిజెపి వ్యాఖ్యలు చేయడంతో ఓటర్లు సీరియస్‌గా ఉన్నారు. ఇక్కడ బిజెపి పిఎంకె పార్టీతో పొత్తు పెట్టుకుంది. బిజెపికి 24, పిఎంకెకి 10 సీట్లు, అమ్మామక్కల్‌, మున్నేట్ర కళగం 2, తమిళ మాలిన కాంగ్రెస్‌ మూడు కేటాయించారు. పుదిచ్చేరిలో బిజెపి పోటీ చేస్తోంది.

➡️