ఐదేళ్లలో 30 రెట్లు పెరిగిన తేజస్వీ సూర్య ఆస్తులు

Apr 7,2024 23:27 #accets, #Tejaswi Surya

బెంగళూరు: కర్నాటక బిజెపి ఎంపీ, ఆ పార్టీ యువమోర్చా జాతీయాధ్యక్షుడు తేజస్వి సూర్య ఆస్తులు అమాంతం పెరిగాయి. గత ఐదేళ్లలో దాదాపు 30 రెట్లు ఎగబాకాయి. 2019 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా దాఖలు చేసిన అఫిడవిట్‌ ప్రకారం ఆయన దాదాపు రూ. 14 లక్షల ఆస్తులతో లక్షాధికారిగా ఉన్న ఆయన ఇప్పుడు 2024 నాటికి దాదాపు రూ.4 కోట్ల ఆస్తులతో కోటీశ్వరుడయ్యారు. గురువారం నామినేషన్‌తో పాటు దాఖలు చేసిన సూర్య ఎన్నికల అఫిడవిట్‌లో ఈ వివరాలు వెల్లడయ్యాయి. 2019కి ముందు.. సూర్య కర్నాటక మాజీ అడ్వకేట్‌ జనరల్‌(ఏజీ) అశోక్‌ హరన్‌హల్లి కార్యాలయంలో ‘లా అసోసియేట్‌’గా పనిచేశారు. తేజస్వీ సూర్య తన చివరి ఆదాయపు పన్ను రిటర్న్స్‌లో 2018-19 ఏడాదికి గానూ రూ. 11,91,000 ఆదాయం చూపించగా.. అది 2022-23ల రూ. 44,13,050గా ఉండటం గమనార్హం. సూర్య చేతిలో రూ.80,000 నగదు, రూ.5.19 లక్షలకు పైగా డిపాజిట్లు చూపించారు. బెంగళూరులో ఎన్నికల ఖర్చు ఖాతాలో రూ.25,000 కూడా చూపించాడు. తేజస్వీ సూర్య.. రిలయన్స్‌ అధినేత ముఖేశ్‌ అంబానీ నేతృత్వంలోని నెట్‌వర్క్‌ 18 మీడియా అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ లిమిటెడ్‌లో గరిష్టంగా 30,000 షేర్లను కలిగి ఉన్నాడు. దీని విలువ రూ. 26,65,500గా ఉన్నది. ‘చరాస్తుల విలువ’ మాత్రమే రూ. 4,10,30,489.95గా ఉన్నదనీ, తన పేరుతో ఎలాంటి ఆస్తి, వాణిజ్య ఆస్తులు, వాహనాలు, రుణాలు లేవని బిజెపి ఎంపీ ప్రకటించారు. తేజస్వీ సూర్యపై మూడు కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.

➡️