తాత్కాలిక రెజ్లింగ్‌ కమిటీని నియమించిన భారత ఒలింపిక్‌ సమాఖ్య

న్యూఢిల్లీ  :   భారత రెజ్లింగ్‌ సమాఖ్య (ఐఒసి) తాత్కాలిక రెజ్లింగ్‌ బాడీ (అడహక్‌ కమిటీ)ని నియమిస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. రెజ్లర్ల ఆందోళనలకు తలగ్గిన కేంద్రం డబ్ల్యుఎఫ్‌ఐకి ఎన్నికైన నూతన కమిటీని రద్దు చేసిన సంగతి తెలిసిందే. భూపీందర్‌ సింగ్‌ బజ్వా నేతృత్వంలో ఐఒసి తాత్కాలిక కమిటీ (అడహక్‌ కమిటీ)ని నియమించింది. ఎంఎం. సౌమ్య, మంజూష కన్వర్‌లు అడహక్‌ కమిటీలో సభ్యులుగా కొనసాగుతారని ప్రకటించింది.

డబ్ల్యుఎఫ్‌ఐలో న్యాయమైన, జవాబుదారీతనం, పారదర్శకత్వాన్ని నిర్థారించడానికి ఈ అడహక్‌ కమిటీని నియమించినట్లు ఐఒఎ తెలిపింది. డబ్ల్యుఎఫ్‌ఐకి ఇటీవల ఎన్నికైన అధ్యక్షుడు, అధికారులు రెజ్లింగ్‌ రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించడంతో పాటు ఏకపక్ష నిర్ణయాలను తీసుకున్నారని ఐఒసి చీఫ్‌ పిటి.ఉషా లేఖలో పేర్కొన్నారు. ఐఒసి ప్రతిపాదించిన సుపరిపాలన సూత్రాలకు వ్యతిరేకంగా, తగిన ప్రక్రియను అనుసరించ కుండా నియంతృత్వంగా వ్యవహరించిందని ఆవేదన వ్యక్తం చేశారు.

రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన బిజెపి ఎంపి బ్రిజ్‌ భూషణ్‌ సింగ్‌ సన్నిహితుడు సంజరు సింగ్‌ డబ్ల్యుఎఫ్‌ఐ చీఫ్‌గా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలపై రెజ్లర్లు ఆవేదన వ్యక్తం చేశారు. రెజ్లింగ్‌కు సాక్షి మాలిక్‌ రిటైర్మెంట్‌ ప్రకటించగా, మరో రెజ్లర్‌ బజరంగ్‌పూనియా పద్మశ్రీని వెనక్కి ఇచ్చేశారు. మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ సింగ్‌ నివాసం నుండే డబ్ల్యుఎఫ్‌ఐ కార్యాలయం పనిచేస్తోందని వినేష్‌ ఫోగట్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖేల్‌రత్న, అర్జున అవార్డులను వెనక్కి ఇచ్చేస్తున్నట్లు ప్రకటించారు.

➡️