మణిపూర్‌లో మళ్లీ ఉద్రిక్తత.. భద్రతా బలగాల మోహరింపు

Feb 29,2024 10:03 #Manipur violence
Tension again in Manipur.. Deployment of security forces

ఇంఫాల్‌ : మణిపూర్‌లో మళ్లీ ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీంతో ఇంఫాల్‌ ఈస్ట్‌ ప్రాంతంలో అస్సాం రైఫిల్స్‌ను మోహరించారు. మొయితీ గ్రూపునకు చెందిన వ్యక్తులు ఒక సీనియర్‌ పోలీసు అధికారిని కిడ్నాప్‌ చేశారని అధికారులు తెలిపారు. స్పందించిన పోలీసు, సెక్యూర్టీ బలగాలు తక్షణమే స్పందించి అదనపు ఎస్‌పి అమిత్‌ కుమార్‌ను రక్షించాయని అన్నారు. ప్రస్తుతం ఆయనను ఆస్పత్రిలో చేర్పించామని, ఆయన పరిస్థితి నిలకడగా ఉందని అన్నారు. మంగళవారం రాత్రి ఏడు గంటల సమయంలో ఈ కిడ్నాప్‌ జరిగింది. ఇంపాల్‌ ఈస్ట్‌లోని వాంగ్‌ఖేరులో ఉన్న అమిత్‌ కుమార్‌ నివాసంపై మొయితీ కమ్యూనిటీ అటాక్‌ చేసినట్లు తెలుస్తోంది. ఆయన నివాసాన్ని దోచుకోవడంతో పాటు సుమారు నాలుగు వాహనాలను ధ్వంసం చేశారని వారు అన్నారు. వాహనచోరీకి పాల్పడ్డారంటూ మొయితీ కమ్యూనిటీకి చెందిన ఆరుగురు సభ్యులను అమిత్‌కుమార్‌ అరెస్ట్‌ చేశారు. వారిని విడుదల చేయాలంటూ మీరా పైబీస్‌ (మొయితి మహిళా బృందం) నిరసన వ్యక్తం చేసింది. రోడ్లను దిగ్భందించింది.

➡️