మోడీని గద్దె దించడమే లక్ష్యం : ఏచూరి

Jan 31,2024 08:51 #New Delhi, #Sitaram Yechury, #speech
  • హద్దుల్లేని ఇడి దుర్వినియోగం : సిపిఐ(ఎం) కేంద్రకమిటీ సమావేశం అనంతరం మీడియాతో ఏచూరి

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : దేశ ప్రజల జీవితాలను సంక్షోభంలోకి నెట్టి, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు సిపిఐ(ఎం) శాయశక్తులా పోరాడుతుందని పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పేర్కొన్నారు. తిరువనంతపురంలోని ఇఎంఎస్‌ అకాడమీలో మూడు రోజుల పాటు జరిగిన సిపిఎం కేంద్ర కమిటీ సమావేశం మంగళవారం ముగిసింది. ఈ సందర్భంగా ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ 2024 లోక్‌సభ ఎన్నికలకు సన్నద్ధతపై కేంద్రకమిటీ చర్చించిందన్నారు., అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవ తీరు రాజ్యాంగాన్ని ఉల్లంఘించేందుకు బిజెపి ప్రభుత్వం స్పష్టమైన ప్రణాళికతో ఉందనే విషయాన్ని వెల్లడించిందన్నారు. బిజెపిని గద్దె దించేందుకు రాష్ట్రాల వారీగా పొత్తులు, సర్దుబాట్లు సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని అన్నారు. ”ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పరిస్థితి ఉంది. కేరళలో ఎల్‌డిఎఫ్‌, కాంగ్రెస్‌ మధ్య ప్రత్యక్ష పోరు. ఇక్కడ బిజెపికి సీట్లు రావు. అదే తమిళనాడులో డిఎంకె నేతృత్వంలోని సెక్యులర్‌ ఫ్రంట్‌. బీహార్‌లో నితీష్‌ కుమార్‌ పార్టీ మినహా మహాకూటమి ఉంది. ‘ఇండియా’ వేదికకు చాలా రాష్ట్రాల్లో ఉమ్మడి అభ్యర్థులు ఉన్నారు. కేరళ, బెంగాల్‌ వంటి రాష్ట్రాల్లో ఇది సాధ్యం కాదు. ఎన్నికల రాజకీయాల్లో రెండు, రెండు కలిపితే నాలుగు కాదు. బీహార్‌లో ప్రస్తుత పరిణామాలకు నితీష్‌ కుమారే కారణమని అన్నారు. ఇడి, సిబిఐని బిజెపి, కేంద్ర ప్రభుత్వం రాజకీయ సాధనంగా వాడుకుంటున్నాయి. ఇడి కేసు పెట్టిన వారు బిజెపిలో చేరితే కేసు క్లోజ్‌ అయ్యే పరిస్థితి ఉంది. 2019 తరువాత ఇడి 5,500 కంటే ఎక్కువ కేసులను నమోదు చేసింది. 23 శాతం కేసులు మాత్రమే కోర్టుకు చేరాయి. ప్రత్యర్థులను భయపెట్టడానికి, వేధించడానికి ఇడి ఉపయోగించబడుతుంది. కేరళను కష్టాల్లోకి నెట్టిన బిజెపికి సాయం చేయడమే కాంగ్రెస్‌ వైఖరి” అని ఏచూరి విమర్శించారు.

ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషిన్‌ (ఇవిఎం) సిస్టమ్‌లోని యంత్రాల క్రమాన్ని రీ సీక్వెన్సింగ్‌ చేయాలని ఆయన అన్నారు.. ఇవిఎం వ్యవస్థలో బ్యాలెట్‌ యూనిట్‌ (బియు), కంట్రోల్‌ యూనిట్‌ (సియు), ఇటీవల జోడించిన ఓటర్‌ వెరిఫైబుల్‌ పేపర్‌ ఆడిట్‌ ట్రయల్‌ (వివి ప్యాట్‌) ఉన్నాయి. ఇవిఎంల పనితీరుపై ప్రజల్లో నెలకొన్న అసంతృప్తిని సిపిఎం గుర్తించింది. పోలింగ్‌ బూత్‌లో ఈ మెషీన్ల ప్లేస్‌మెంట్‌ సీక్వెన్స్‌లో మార్పును ప్రతిపాదించాం” అని ఏచూరి తెలిపారు. ”ప్రస్తుతం, ఈ ప్రక్రియలో యూనిట్‌లో ఓటింగ్‌ ఉంటుంది. ఇది కంట్రోల్‌ యూనిట్‌కి బదిలీ చేయబడే ముందు ధ్రువీకరణ కోసం వివిప్యాట్‌కి పంపిస్తుంది. మేము ఓటరు యూనిట్‌ నుండి వివి ప్యాట్‌కి ప్రసారాన్ని ట్రాక్‌ చేయగలిగినప్పటికీ, వివిప్యాట్‌ నుండి కంట్రోల్‌ యూనిట్‌కు ఏమి ప్రసారం చేయబడుతుందనే దానిపై అనిశ్చితి ఉంది. కాబట్టి, మేము క్రమంలో మార్పును సూచిస్తున్నాము. ఓటర్‌ యూనిట్‌, తరువాత కంట్రోల్‌ యూనిట్‌, ఆ తరువాత వివి ప్యాట్‌. ఈ విధంగా, ఓటర్లు తమ ఓటు కచ్చితంగా కంట్రోల్‌ యూనిట్‌లో నమోదైందని ధ్రువీకరించుకోవచ్చు” అని ఆయన అన్నారు. 50 శాతం వివి ప్యాట్‌లను ఓటింగ్‌ మెషీన్‌లో ప్రదర్శించే సమాచారంతో క్రాస్‌ చెక్‌ చేసుకోవాల్సిన అవసరాన్ని ఏచూరి నొక్కిచెప్పారు. ”ఈ విధానం ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఉంటుంది. అన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్థులకు సమానమైన అవకాశాన్ని అందించేలా, ప్రజలలో విశ్వాసాన్ని నింపడం లక్ష్యంగా పెట్టుకోవాలి” అని ఏచూరి తెలిపారు.

ఈ విలేకరుల సమావేశంలో ఏచూరితోబాటు పార్టీ కేరళ రాష్ట్ర కార్యదర్శి, పొలిట్‌బ్యూరో సభ్యులు ఎంవి గోవిందన్‌ మాస్టార్‌, పొలిట్‌బ్యూరో సభ్యులు ఎంఎ బేబి కూడా పాల్గొన్నారు .

➡️