Opposition : ఆ వ్యాఖ్యలు ప్రధాని అనారోగ్య మనస్తత్వానికి నిదర్శనం

న్యూఢిల్లీ   :    శ్రావణ మాసంలో రాజకీయ నేతలు మాంసాహారాన్ని తినడంపై ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు ఆయన అనారోగ్య మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తున్నాయని ప్రతిపక్షాలు శుక్రవారం పేర్కొన్నాయి. లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రధాని అధైర్యస్థితిని సూచిస్తున్నాయని ప్రతిపక్షాలు విమర్శించాయి.

లోక్‌సభ ఎన్నికల్లో  ఓటమి పాలవుతామని ప్రధాని మోడీ    ‘భయాందోళన’కు గురయ్యారని, అందుకే  ” ప్రతిరోజూ కొత్త అంశం లేవనెత్తుతున్నారు” అని కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రటరీ జైరాం రమేష్‌ ఎద్దేవా చేశారు . ప్రతి రోజూ ప్రధాని తన అనారోగ్య మనస్తత్వానికి ఓ కొత్త ఉదాహరణను అందిస్తున్నారని,  ఆయన వ్యాఖ్యలు  విసుగుతెప్పిస్తున్నాయని   అన్నారు.   మధ్యాహ్న భోజన కార్యక్రమం కింద పాఠశాల విద్యార్థులకు మే నెలలో అల్పాహారాన్ని అందించే రూ.4,000 కోట్ల రూపాయల పథకాన్ని నిధుల కొరత పేరుతో ఆర్థికమంత్రిత్వ శాఖ రద్దు చేసిందని ధ్వజమెత్తారు.

ప్రధాని మోడీ నిరుద్యోగం, పేదరికం అంశాల గురించి ఎందుకు చర్చించరని ఆర్‌జెడి నేత, బీహార్‌ ప్రతిపక్ష నేత తేజస్వీయాదవ్‌ ప్రశ్నించారు. పేదరికాన్ని ఎందుకు నిర్మూలించలేదని, బీహార్‌కు ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. లోక్‌సభ ఎన్నికల ముందు ప్రధాని మోడీ భయాందోళనకు గురయ్యారని ఆర్‌జెడి ప్రతినిధి సుబోధ్‌ కుమార్‌ తెలిపారు. ప్రధాని ప్ర కటనను, తమ నేత లాలూ యాదవ్‌ను కించపరిచేలా వ్యాఖ్యానించడాన్ని ఖండిస్తున్నామని అన్నారు. ఒకరి ఆహార పద్ధతులను ఏ చట్టం లేదా మతగ్రంధం నిర్దేశించదని స్వయంగా ప్రధాని మోడీ అంగీకరించారని అన్నారు.

హిందూ క్యాలెండర్‌లోని పవిత్రమాసమైన ‘సావన్‌’ లో ప్రతిపక్ష నేతలు మాంసాహారం తింటున్న వీడియోలను పోస్ట్‌ చేస్తూ దేశ ప్రజలను అపహాస్యం చేయడానికి యత్నిస్తున్నారని శుక్రవారం జమ్ముకాశ్మీర్‌లోని ఉదంపూర్‌లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోడీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. గత సెప్టెంబర్‌లో ఆర్‌జెడి అధ్యక్షుడు లాలూ యాదవ్‌, కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీలు మటన్‌ ండుతున్న వీడియోను సూచిస్తూ ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు.

➡️