ఓటింగ్‌పై అవినీతి ప్రభావం

Apr 13,2024 23:24 #Corruption, #Voting

గత ఐదేళ్లలో 15 శాతం పెరిగిన అవినీతి
సిఎస్‌డిఎన్‌-లోక్‌నీతి ప్రీ పోల్‌ సర్వే వెల్లడి
ఎలక్షన్‌ డెస్క్‌ :యుపిఎ ప్రభుత్వ హయాంలో అవినీతి పెరిగిపోయిందని, అవినీతిని అంతమొందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఎన్‌డిఎ అధికారంలోకి వచ్చింది. కానీ ప్రధాని మోడీ నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వ హయాంలో.. ముందటి కంటే అవినీతి పెరిగిపోయిందని పలు సర్వేలు వెల్లడించాయి. మరీ ముఖ్యంగా గత (2019-2024) ఐదేళ్లలో అవినీతి గణనీయంగా పెరిగిందని తాజా సిఎస్‌డిఎస్‌ – లోక్‌నీతి ప్రీ పోల్‌ సర్వేలో వెల్లడైంది. 2019 ప్రీ పోల్‌ సర్వేతో పోలిస్తే 2024లో దాదాపు 15 శాతం అవినీతి పెరిగిందని సిఎస్‌డిఎస్‌ లోక్‌నీతి ప్రీ పోల్‌ సర్వే బట్టబయలు చేసింది.
15 శాతం పెరుగుదల
2019లో 40 శాతం అవినీతి ఉంటే.. ఇప్పుడు 2024కి 55 శాతం అవినీతి పెరిగింది. కానీ దీనికి విరుద్ధంగా బిజెపి నేతలు వాదిస్తారు. 2019లో 37 శాతం ఉన్న అవినీతి కాస్తా.. 2024కల్లా 19 శాతానికి తగ్గిందని నీతులు చెబుతున్నారు. బిజెపి నేతలు చెబుతున్నదానికి వాస్తవ విరుద్ధంగా అవినీతి ఉందని లోక్‌నీతి ప్రీ పోల్‌ సర్వే లెక్కలు చెబుతున్నాయి. దేశంలో అవినీతి పెరిగిందా, తగ్గిందా అని గ్రామీణ ప్రజలను అడిగితే.. కచ్చితంగా అవినీతి పెరిగిందనే అభిప్రాయం వెలిబుచ్చారు. పట్టణ, నగర జనాభాలో కూడా ఇదే అభిప్రాయం ఉంది. ఇక పేద, దిగువ మధ్యతరగతి, మధ్యతరగతి, ధనిక వర్గాల అభిప్రాయం చూసుకున్నా.. దాదాపు 55 శాతం అవినీతి పెరిగిందని చెబుతున్నారు. అవినీతిపై తటస్థంగా ఉన్న వారు శాతంపైగానే ఉంది.
కేంద్రానిదే ఎక్కువ పాత్ర
ప్రధానంగా అవినీతి పెరగడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కారణంగా భావిస్తున్నట్లు 56 శాతం మంది సర్వేలో తెలిపారు. కానీ దేశంలో ఎక్కువగా అవినీతి పెరగడానికి రాష్ట్ర ప్రభుత్వానికన్నా.. కేంద్ర ప్రభుత్వానిదే బాధ్యత అని చాలామంది ప్రజానీకం అభిప్రాయపడ్డారు. మరి ఎన్‌డిఎ హయాంలో జరిగిన అవినీతి ప్రభావం ఓటింగ్‌పై ప్రతికూలంగా ఉంటుందని ఈ సర్వే వెల్లడించింది. ఏ మేరకు ఓటర్లపై అవినీతి ప్రభావం చూపుతుందో వేచి చూడాల్సిందే.

జనాభా            పెరిగింది      తగ్గింది    తటస్థం
గ్రామీణ జనాభా  55 శాతం   19 శాతం  18 శాతం
పట్టణ జనాభా  53 శాతం    19 శాతం   23 శాతం
నగర జనాభా  57 శాతం      19 శాతం   16 శాతం

ఆర్థిక తరగతి      పెరిగింది      తగ్గింది        తటస్థం
పేద వర్గం         58 శాతం   16 శాతం     17 శాతం
దిగువ మధ్యతరగతి 54 శాతం 19 శాతం   19 శాతం
మధ్యతరగతి   53 శాతం        20 శాతం     20 శాతం
ధనిక వర్గం    57 శాతం          23 శాతం      17 శాతం

➡️