దిగొచ్చిన ఎయిర్‌ ఇండియా – తొలుత 30 మంది సీనియర్‌ సిబ్బందిపై వేటు

May 10,2024 08:24 #30, #air india, #senior staff
  • నిరసనలు కొనసాగడంతో యాజమాన్యం చర్చలు
  • తొలగింపు ఉత్తర్వులు వెనక్కి తీసుకుంటామని హామీ

న్యూఢిల్లీ : దేశంలోనే ప్రధాన విమానయాన సంస్థ ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ యాజమాన్యం ఎట్టకేలకు దిగొచ్చింది. వేతనాలు, పని వేళలు ఇతర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఉద్యోగులు అనూహ్యంగా సామూహిక సెలవు పెట్టి సమ్మె చేపట్టడంతో ఎయిర్‌ ఇండియా యాజమాన్యం తీవ్రమైన అణిచివేత చర్యలకు పాల్పడింది. దాదాపు 170 సర్వీసులను రద్దు చేయడంతో అటు ప్రయాణికులను ఇబ్బందుల పాల్జేసింది. ఇటు సామూహిక సెలవులో ఉన్న 30 మంది వరకు సీనియర్‌ ఉద్యోగులను తొలగిస్తూ సర్క్యులర్లు పంపింది. సెలవుపై ఉన్న మిగిలిన వారందరూ ఈ నెల 9న సాయంత్రం 4 గంటల లోగా విధులకు హాజరవ్వాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సివుంటుందని హెచ్చరించింది. అయితే ఈ బెదిరింపులను ఉద్యోగులు పట్టించుకోకుండా తమ ఆందోళనను మరింత ఉధృతంగా కొనసాగించారు. ఆందోళనలో పాల్గొనేవారి సంఖ్య కూడా పెరుతూవచ్చింది. దీంతో గురువారం కూడా మరో 85 సర్వీసులను ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ రద్దు చేయాల్సివచ్చింది. ఉద్యోగుల సమ్మెకు ప్రయాణీకుల నుంచి కూడా మద్దతు లభించింది. దీంతో యాజమాన్యంపై ఒత్తిడి పెరగడం, అటు లేబర్‌ కమిషనర్‌ కూడా రంగంలోకి దిగడంతో చర్చలకు అంగీకరించింది. న్యూఢిల్లీలోని ఛీఫ్‌ లేబర్‌ కమిషనర్‌ (సెంట్రల్‌) కార్యాలయంలో గురువారం యాజమాన్యానికి, ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ ఉద్యోగుల సంఘం ప్రతినిధుల మధ్య చర్చలు జరిగాయి. అనంతరం ఇరుపక్షాలు ఒక పత్రంపై సంతకాలు చేశాయి. మీడియా కథనాల ప్రకారం..తొలగింపు సర్క్యులర్లను వెనక్కి తీసుకుంటామని, వేతనాలు, పనివేళలకు సంబంధించిన ఇతర సమస్యలపై పరిష్కారానికి కృషి చేస్తామని యాజమాన్యం హామీ ఇచ్చింది. ఉద్యోగులు కూడా సెలవును వెనక్కి తీసుకొని విధులకు హాజరు అవుతామని పేర్కొన్నట్లు తెలిసింది. దీంతో బుధ, గురువారాల్లో విమాన సర్వీసుల రద్దు కారణంగా చిక్కుకుపోయిన ప్రయాణీకులకు కూడా ఉపశమనం లభించినట్లు అయ్యింది.

➡️