నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల.. ఏపీ, తెలంగాణలో నేటి నుంచే నామినేషన్లు

Apr 18,2024 08:12 #election notification, #released

ఢిల్లీ: నాలుగో దశ సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్‌ వెలువడింది. ఏపీ, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం అసెంబ్లీలు సహా 10 రాష్ట్రాల్లో లోక్‌సభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ చేసింది. నాలుగో విడతలో లోక్‌సభ ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, బిహార్‌, ఝార్కండ్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, ఒడిశా, ఉత్తర్‌ప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌, జమ్మూకశ్మీర్‌ ఉన్నాయి. వీటిలో మొత్తం 96 లోక్‌సభ స్థానాల్లో నాలుగో దశలో ఎన్నికలు జరగనున్నాయి.
నోటిఫికేషన్‌ విడుదలైన నేపథ్యంలో నేటి నుంచి ఏపీ, తెలంగాణ సహా ఆయా రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. ఈనెల 25 వరకు నామినేషన్ల స్వీకరణ చేపట్టి.. 26న పరిశీలించనున్నారు. 29 వరకు ఉపసంహరణకు గడువు విధించారు. మే 13న ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. జూన్‌ 4న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు.
లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులు కలెక్టరేట్లలో, అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు ఆయా నియోజకవర్గాల ప్రధాన కేంద్రాల్లో నామినేషన్‌ పత్రాలు సమర్పించాలి. లోక్‌సభ అభ్యర్థి రూ.25 వేలు, శాసనసభ అభ్యర్థి రూ.10 వేలు ధరావతు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఇందులో 50% చెల్లిస్తే సరిపోతుంది.

నామినేషన్ల దాఖలు చేసేప్పుడు అభ్యర్ధులు తీసుకోవలసిన జాగ్రత్తలు, పాటించాల్సిన నిబంధనలు

  • నామినేషన్ల దాఖలకు 13 రకాల డాక్యుమెంట్లను తీసుకురావాలి.
  • అన్ని డాక్యుమెంట్లు సక్రమంగా ఉన్న నామినేషన్లను అనుమతిస్తారు.
  • పార్లమెంటరీ నియోజకవర్గం కోసం ఫారం-2ఏ, అసెంబ్లీ నియోజకవర్గం కోసం ఫారం-2బి సమర్పించాలి,
  • నోటిఫైడ్‌ తేదీలలో ఉదయం 11.00 నుండి మధ్యాహ్నం 3.00 వరకు నామినేషన్లను స్వీకరణ
  • ప్రభుత్వ సెలవు దినాలలో నామినేషన్ల స్వీకరణ ఉండదు.
  • ఒక అభ్యర్థి గరిష్టంగా 4 సెట్ల నామినేషన్లు దాఖలు చేయవచ్చు.
  •  2 కంటే ఎక్కువ నియోజకవర్గాల నుండి అభ్యర్థులు నామినేషన్లను ఫైల్‌ చేయడం కుదరదు
  • అభ్యర్థి నామినేషన్‌ వేసేటప్పుడు దరఖాస్తును పూర్తిగా పూరించారా లేదా సరి చూసుకోవాలి
  • అఫిడవిట్‌ ప్రతి పేజీ పైన అభ్యర్థి విధిగా సంతకం చేయాలి
  • పార్లమెంట్‌ నియోజకవర్గ పోటీకి జనరల్‌ అభ్యర్థి సెక్యూరిటీ డిపాజిట్‌గా 25 వేల రూపాయలు
  • అదే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే కుల ధవీకరణ పత్రం సమర్పిస్తూ 12,500 సెక్యూరిటీ డిపాజిట్‌ చెల్లించాల్లిస్తే సరిపోతుంది
  • అసెంబ్లీ నియోజకవర్గ పోటీకి జనరల్‌ అభ్యర్థి 10 వేలు, ఎస్సి, ఎస్టీ అభ్యర్థులు 5వేలు డిపాజిట్‌ చేయాలి
  • ఇటీవలే మూడు నెలల లోపల ఫోటో తీసుకున్నట్లుగా డెకరేషన్‌ ఇవ్వాలి,
  •  2.5 సెంమీ సైజు మూడు కలర్‌ ఫొటోలు సమర్పించాలి
  • ఇతర నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులు అయితే ఎలక్ట్రోల్‌ రోల్‌ సర్టిఫైడ్‌ కాపీని సమర్పించాలి,
  • ఇంక్‌తో సంతకం చేసిన ఫారం ఏ , బీని రిటర్నింగ్‌ ఆఫీసర్‌ కి సమర్పించాలి,
  • జిరాక్స్‌ కాపీలు అనుమతించడం జరగదు
  • అభ్యర్థి ఎన్నికల వ్యయ పరిశీలన కొరకు నూతనంగా ఏదేని బ్యాంకు/కోఆపరేటీవ్‌ బ్యాంకు/పోస్టాఫీసు లో తన తెరిచిన ప్రత్యేక బ్యాంక్‌ అకౌంట్‌ వివరాలు సమర్పించాలి
  • బ్యాలెట్‌ పేపర్‌ లో తన పేరు తెలుగు, ఇంగ్లీషు భాషల్లో ఏ విధంగా ప్రచురించాలో తెలియజేయాలి
  • ఇండిపెండెంట్‌ అభ్యర్థులు అయితే ఎంచుకున్న సింబల్‌ ను సూచించవలసి ఉంటుంది.
  • నామినేషన్ల దాఖలు సమయంలో 100 మీటర్ల వత్త పరిధిలో గరిష్టంగా 3 వాహనాలు అనుమతించడం జరుగుతుంది.
  • నామినేషన్ల దాఖలు చేసేప్పుడు అభ్యర్థితో కలిపి గరిష్టంగా 5 గురు వ్యక్తులకు మాత్రమే ఆర్‌ఓ ఆఫీస్‌లోకి అనుమతి
  • నామినేషన్ల స్వీకరణకు సంబంధించి అవగాహన కల్పించేందుకు పార్లమెంట్‌, అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో హెల్ప్‌ డెస్క్‌ లు ఏర్పాటు
  • అభ్యర్థి నామినేషన్‌ దాఖలు చేసినప్పుటి నుంచి, ఎన్నికల ఖర్చు అతని ఖాతాలో లెక్కించడం జరుగుతుంది.
  • పత్రికల్లో వచ్చే ప్రకటనలు, పెయిడ్‌ న్యూస్‌ వార్తలకు అయ్యే ఖర్చును అభ్యర్థి ఖాతాలో లెక్కిస్తారు
➡️