రాష్ట్రాల అధికారాలు నిర్వీర్యం

Jul 2,2024 00:38 #cpm, #John Brittas, #Rajya Sabha
  • బిజెపితో రాముడు లేడు…
  • రాజ్యసభలో సిపిఎం నేత జాన్‌ బ్రిట్టాస్‌

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా పార్లమెంట్‌ ఉభయ సభల్లో ప్రభుత్వ పాలనా వైఫల్యాలపై ప్రతిపక్షాలు విరుచుకుపడ్డాయి. సిపిఎం ఎంపి జాన్‌ బ్రిట్టాస్‌ మాట్లాడుతూ.. మైనారిటీలను అవమానిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ సహా బిజెపి నేతలు తమ ప్రమాణ స్వీకారాన్ని చేశారని అన్నారు. రాజస్థాన్‌లోని బాన్సువాడలో మోడీ ప్రసంగిస్తూ.. ముస్లిములను చొరబాటుదారులుగా, ఎక్కువ మంది పిల్లలకు జన్మనిచ్చేవారిని అవమానించారని అన్నారు. బిజెపి బుల్‌డోజర్‌ పార్టీగా మారుతోందని, కమలం చిహ్నాన్ని బుల్డోజర్‌గా మార్చవచ్చునని వ్యాఖ్యానించారు. మొరాదాబాద్‌లో న్ని ఐదిళ్లు నేలమట్టమయ్యాయని విమర్శించారు. బిజెపితో శ్రీరాముడు లేడని ఎన్నికలు రుజువు చేశాయన్నారు. రామమందిరం నిర్మించిన ఫైజాబాద్‌లో బిజెపి ఓడిపోయిందని, నాథూరామ్‌ బిజెపితో ఉన్నారని, శ్రీరాముడు కాదని విమర్శించారు. అయోధ్యకు వెళ్లిన మోడీ మణిపూర్‌ వైపు వెనుదిరిగి చూడలేదని అన్నారు. కేంద్రం నిర్వహించే అన్ని పరీక్షల ప్రశ్నపత్రాలు లీక్‌ అవుతున్నాయని, లక్షల మంది విద్యార్థులు కలలు కల్లోలం అయ్యాయని, పరీక్షల నిర్వహణను రాష్ట్రాలకే వదిలేయాలని డిమాండ్‌ చేశారు. దక్షిణాది విద్యార్థులకు ప్రవేశాన్ని నిరాకరించడానికి జెఎన్‌యు సహా కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో కొత్త ప్రవేశ పరీక్షను ప్రవేశపెట్టారని విమర్శించారు. పాఠ్యపుస్తకాలు కవిత్వీకరించబడ్డాయని, గాంధీజీ జ్వరంతో చనిపోయారని, ఆస్పత్రికి నాథూరామ్‌ తీసుకెళ్లారని బోధిస్తారని వ్యాఖ్యానించారు. రాష్ట్రాల అధికారాలను లాక్కొని ఆర్థికంగా కుంగదీస్తోందని, కేరళ, కర్ణాటక నిరసనలు చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఎలక్టోరల్‌ బాండ్‌ స్కామ్‌తో బిజెపికి వేల కోట్లు వచ్చాయని, కోచింగ్‌ సెంటర్లు, బీఫ్‌ కంపెనీలు కూడా బిజెపికి బాండ్లు ఇచ్చాయని విమర్శించారు.

బ్రిట్టాస్‌ ప్రసంగానికి ఛైర్మన్‌ అంతరాయం
రాజ్యసభలో ధన్యవాద తీర్మానం సందర్భంగా జాన్‌ బ్రిటాస్‌ ప్రసంగానికి ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖర్‌ పదేపదే అంతరాయం కలిగించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారకులకు ప్రశ్నాపత్రాలు లీక్‌ అవుతున్నాయన్న వ్యాఖ్యలను రికార్డు నుంచి తొలగించాలని బ్రిట్టాస్‌ను ధన్‌ఖర్‌ కోరడంతోపాటు ఆయన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్‌ఎస్‌ఎస్‌ అనే పదం ఎప్పటి నుంచి ‘అన్‌పార్లమెంటరీ’గా మారిందని బ్రిట్టాస్‌ ఛైర్మన్‌ను ప్రశ్నించారు. బ్రిట్టాస్‌ ప్రసంగం తప్పుదారి పట్టించిందని, దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేశారని ధన్‌ఖర్‌ అన్నారు. మీరు తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని బ్రిట్టాస్‌ తిప్పికొట్టారు. ఛైర్మన్‌ స్వయంగా ప్రసంగాన్ని అడ్డుకోవడం సరైన చర్య కాదని అన్నారు. బిజెపి సభ్యులు కూడా పలుమార్లు జోక్యం చేసుకున్నారు. లోక్‌సభలో రాహుల్‌ గాంధీ, మహువా మొయిత్రా, ఎ రాజా, మనీష్‌ తివారీ తదితరులు, రాజ్యసభలో మల్లికార్జున్‌ ఖర్గే, సంజరు సింగ్‌, మనోజ్‌ ఝా, తిరుచ్చి శివ తదితరులు ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మంగళవారం లోక్‌సభలో చర్చకు ప్రధాని మోడీ సమాధానం ఇవ్వనున్నారు.

➡️