రెండోరోజూ అదే హోరు

Nov 28,2023 11:11 #New Delhi, #Rally, #second day
  • కార్మికులు, రైతు ఐక్యతే కార్పొరేట్‌, మతపరమైన బంధానికి సవాల్‌
  • అదే దేశానికి రక్ష : నేతల ఉద్ఘాటన
  • నేడు రాజ్‌భవన్‌లకు రైతులు, కార్మికుల మార్చ్‌

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : మోడీ ప్రభుత్వ కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను తిప్పికొడతామని దేశవ్యాపితంగా మహా పఢావ్‌ (మహాధర్నా)లో కార్మికులు, కర్షకులు నినదించారు. కేంద్రంలోని మోడీ సర్కార్‌ కార్మిక, కర్షక, ప్రజా, దేశ వ్యతిరేక విధానాలపై సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కెఎం), కేంద్ర కార్మిక సంఘాలు, ఫెడరేషన్ల సంయుక్త వేదిక ఆధ్వర్యాన దేశంలోని అన్ని రాష్ట్ర రాజధానుల్లో రాజ్‌ భవన్‌ (గవర్నర్‌ కార్యాలయాల)ల ఎదుట రెండోరోజు సోమవారం మహాపఢావ్‌ కొనసాగింది. ఇందులో లక్షల మంది కార్మికులు, కర్షకులు పాల్గొన్నారు. వివిధ ప్రజా సంఘాలు సంఘీభావంగా నిలిచాయి. కార్మికులు, రైతు ఐక్యత మోడీ సర్కార్‌ కార్పోరేట్‌, మతపరమైన బంధాన్ని సవాలు చేసింది. డిమాండ్ల చార్టర్‌ను గవర్నర్‌కు సమర్పించేందుకు మంగళవారం రైతులు, కార్మికులు రాజ్‌భవన్‌లకు మార్చ్‌ చేయనున్నారు.

దేశ చరిత్రలో మొదటిసారి

వేలాది మంది రైతులు, కార్మికులు ఆందోళన చేసే దగ్గరే వంటావార్పు చేశారు. మహాధర్నా నిర్వహించిన ప్రాంతంలో ట్రాక్టర్‌ ట్రాలీలు, తాత్కాలిక టెంట్‌లలో రాత్రి బస చేశారు. సోమవారం అధిక సంఖ్యలో రైతులు, కార్మికులు ఆందోళనల్లో భాగస్వాములయ్యారు. మోడీ ప్రభుత్వ హయాంలో కార్మికులు, రైతుల ఐక్యతకు రాజకీయ ప్రాధాన్యతనిస్తూ ఎన్నికలకు వెళ్లే రాష్ట్రాలు మినహా అన్ని రాష్ట్ర రాజధానుల్లో మహాధర్నాలు కొనసాగుతున్నాయి. నిర్దిష్ట డిమాండ్‌ చార్టర్‌, కార్యాచరణ ప్రణాళికతో కార్మికులు, రైతుల వేదికల కలయిక స్వతంత్ర భారతదేశ చరిత్రలో మొదటిసారిగా జరుగుతోంది.

వ్యవసాయ సంక్షోభాన్ని పరిష్కరించాలి

జాతీయ స్థాయిలో ప్రధాన రాజకీయ సమస్యగా మారిన వ్యవసాయ సంక్షోభాన్ని పరిష్కరించాలని పలువురు నేతలు డిమాండ్‌ చేశారు. మహాధర్నాల వద్ద పలువురు అఖిల భారత నాయకులు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. నయా ఉదారవాద విధానాలు వ్యవసాయ సంక్షోభానికి మూలమని విమర్శించారు. దీని వినాశకరమైన ప్రభావాలు రైతుల జీవితాలను మాత్రమే కాకుండా కార్మికులు, యువకుల జీవితాన్ని కూడా నాశనం చేస్తున్నాయని పేర్కొన్నారు. వ్యవసాయ సంక్షోభాన్ని తొలగించడం రైతులతో పాటు కార్మికుల ఉమ్మడి బాధ్యతగా మారిందన్నారు. వ్యవసాయ సంక్షోభం, సంబంధిత వ్యవసాయ కార్పొరేటీకరణ విధానం అఖిల భారత స్థాయిలో ప్రధాన రాజకీయ సమస్యగా మారాయన్నారు. ప్రతి కార్మికుడు, రైతు అన్ని గ్రామాలు, పట్టణాల్లో ఇంటింటికీ ప్రచారం చేయాలని, పోరాటాలు మరింత విస్తరించాలని పిలుపునిచ్చారు.

కార్మికులు, రైతుల జీవనోపాధిపై క్రూరమైన దాడి

మోడీ ప్రభుత్వం కార్పొరేట్‌ దోపిడీని సులభతరం చేయడానికి కార్మికులు, రైతుల జీవితాలు, జీవనోపాధిపై క్రూరమైన దాడికి పాల్పడుతోందని విమర్శించారు. కార్మికులు, రైతుల ఐక్యతను అణిచివేసేందుకు బిజెపి-ఆర్‌ఎస్‌ఎస్‌ మత రాజకీయాలు చేస్తూ, విద్వేష ప్రచారం చేస్తోందని అన్నారు. రైతులు, కార్మికుల ఐక్యత మాత్రమే కార్పొరేట్‌, మతపరమైన బంధం ప్రమాదాన్ని సవాలు చేయగలదని, దేశాన్ని రక్షించగలదని నొక్కి చెప్పారు. కార్మిక, కర్షక మహాధర్నా శ్రమజీవుల్లో విశ్వాసం నింపుతుందని చెప్పారు. కార్మికులు, రైతులు మంగళవారం రాజ్‌ భవన్‌ల వైపు కవాతు చేయడంతో మహాపఢావ్‌ ముగియనుంది. 21 ఉమ్మడి డిమాండ్ల చార్టర్‌ను సంబంధిత గవర్నర్‌లకు సమర్పించనున్నట్లు నేతలు తెలిపారు.

➡️