17వ లోక్‌సభ తీరు తెన్నులు

Feb 11,2024 10:55 #17th, #Bills, #Lok Sabha
  • 222 బిల్లులు ఆమోదం
  • 1,354 గంటల పాటు భేటీ
  • 387 గంటల సమయం వృథా
  • లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా వెల్లడి

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : 17వ లోక్‌సభ పని ఉత్పాదకత దాదాపు 97 శాతం జరిగిందని, ఇది గత 5 లోక్‌సభలలో అత్యధికమని లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా అన్నారు. జనవరి 31న ప్రారంభమైన 17వ లోక్‌సభ 15వ సెషన్‌ శనివారం ముగిసింది. దీంతో 17వ లోక్‌సభ కూడా ముగిసినట్టైంది. ఈ సందర్భంగా ఓం బిర్లా మాట్లాడుతూ 2019 జూన్‌ 17న 17వ లోక్‌సభ మొదటి సమావేశం ప్రారంభమైందని, ఈ లోక్‌సభలో 543 మంది సభ్యులలో 540 మంది సభ్యులు సభలో చర్చలో పాల్గొన్నారని తెలిపారు. 17వ లోక్‌సభలో మహిళలకు అత్యధిక ప్రాతినిథ్యం ఉందని, సభా కార్యకలాపాలలో వారు చురుకుగా పాల్గొన్నారని అన్నారు. మొత్తం 15 సెషన్‌ ల్లో 274 సిట్టింగ్‌ లు జరగగా, 1,354 గంటలపాటు జరిగాయని అన్నారు. సభ నిర్ణీత సమయం కంటే 345 గంటల పాటు అదనంగా జరిగిందని, ఈ లోక్‌సభలో అంతరాయాలతో మొత్తం 387 గంటల సమయం వృథా అయిందని అన్నారు. ఐదేళ్లలో 222 బిల్లులు ఆమోదించామని, ఈ క్రమంలో 202 బిల్లులు ప్రవేశపెట్టగా 11 బిల్లులను ప్రభుత్వం వెనక్కి తీసుకుందని తెలిపారు.నారీ శక్తి వందన్‌ బిల్లు, జమ్మూ కాశ్మీర్‌ పునర్వ్యవస్థీకరణ బిల్లు, ఇండియన్‌ జ్యుడీషియల్‌ కోడ్‌, ఇండియన్‌ ఎవిడెన్స్‌ బిల్లు, ఇండియన్‌ సివిల్‌ సెక్యూరిటీ కోడ్‌, సోషల్‌ సెక్యూరిటీ కోడ్‌, డిజిటల్‌ పర్సనల్‌ డేటా ప్రొటెక్షన్‌ బిల్లు, ముస్లిం మహిళలు (వివాహాలపై హక్కుల పరిరక్షణ) బిల్లు, వినియోగదారుల రక్షణ బిల్లు, ప్రత్యక్ష పన్ను వివాదాలు ట్రస్ట్‌ బిల్లు, లేబర్‌ కోడ్స్‌, ఇండిస్టియల్‌ రిలేషన్స్‌ కోడ్‌ మొదలైన అనేక చారిత్రాత్మక బిల్లులు ఆమోదించాయని అన్నారు.

లోక్‌సభలో 4,663 స్టార్‌ ప్రశ్నలు జాబితా అయ్యాయని, అందులో 1,116 ప్రశ్నలకు మౌఖిక సమాధానాలు ఇచ్చారని అన్నారు. అదే సమయంలో, 55,889 అన్‌ స్టార్‌ ప్రశ్నలు కూడా అడిగారు. సభలో లిఖితపూర్వక సమాధానాలు ఇచ్చారని అన్నారు.

ఈ లోక్‌సభలో 729 ప్రైవేట్‌ బిల్లులను సభలో ప్రవేశపెట్టారు. సంబంధిత మంత్రులు 26,750 పేపర్లను టేబుల్‌పై పెట్టారని అన్నారు. జీరో అవర్‌ కింద 5,568 అంశాలు లేవనెత్తగా, రూల్‌ 377 కింద 4,869 అంశాలను లేవనెత్తారని తెలిపారు. 18 జూలై 2019న జీరో అవర్‌లో ఒకే రోజు మొత్తం 161 అంశాలు లేవనెత్తాయని, 17వ లోక్‌సభ మొదటి సెషన్‌లో జీరో అవర్‌లో 1,066 అంశాలు లేవనెత్తడం రికార్డు అని అన్నారు.

లోక్‌సభలో వివిధ అంశాలపై మంత్రులు 534 ప్రకటనలు చేశారని, రూల్‌ 193 కింద 12 అంశాలపై స్వల్పకాలిక చర్చలు జరిగాయని అన్నారు. ఈ లోక్‌సభలో పార్లమెంటరీ కమిటీలు మొత్తం 691 నివేదికలను సమర్పించాయని, పార్లమెంటరీ కమిటీల సిఫార్సుల్లో 69 శాతానికి పైగా ప్రభుత్వం ఆమోదించిందని అన్నారు. లోక్‌సభలో దాదాపు రూ. 875 కోట్ల ఆదా జరిగిందని, ఇది సచివాలయ బడ్జెట్‌లో 23 శాతమని బిర్లా పేర్కొన్నారు. ఈ లోక్‌సభలో ఈ క్యాంటీన్‌ సబ్సిడీ పూర్తిగా రద్దు చేశామని, సుమారు రూ.15 కోట్లు ఆదా అవుతుందని అన్నారు. రాజ్యాంగ పరిషత్‌లో ముఖద్వారం లైటింగ్‌ ఏర్పాటు చేయడంతో పాటు లోక్‌సభ టీవీ, రాజ్యసభ టీవీలను విలీనం చేయడం వల్ల కోట్ల ఆదా అయ్యాయని అన్నారు. 16 దేశాలకు చెందిన పార్లమెంటరీ ప్రతినిధులు ఇండియాకు చేరుకున్నారని. అంతేకాకుండా దేశం నుంచి 42 మంది ప్రతినిధులు విదేశాలకు వెళ్లారని అన్నారు.

➡️