వృద్ధులు, జర్నలిస్టులకు రాయితీలు ఉండవు : రైల్వే మంత్రి స్పష్టీకరణ

అహ్మదాబాద్‌ : ఇప్పటికే ప్రతి ప్రయాణికుడికీ 55 శాతం రాయితీని రైల్వే శాఖ అందిస్తోందని, ఇక ప్రత్యేక రాయితీలు ఉండవని ఆ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ స్పష్టం చేశారు. వృద్ధులకు, జర్నలిస్టులకు గతంలో ఇచ్చిన రాయితీ పునరుద్ధరణ గురించి మీడియా ప్రతినిధులు అడిగినప్పుడు ఆయన పైవిధంగా స్పందించారు. ప్రతి ప్రయాణికుడూ ఇది వరకే రాయితీని అనుభవిస్తుండగా.. ప్రత్యేకంగా రాయితీ అవసరం లేదన్నట్లు పరోక్షంగా ఆయన బదులిచ్చారు. బుల్లెట్‌ రైలు ప్రాజెక్ట్‌ సహా వివిధ అంశాలపై అహ్మదాబాద్‌లో అశ్వినీ వైష్ణవ్‌ సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ”ప్రతి ప్రయాణికుడికి రైల్వే శాఖ 55 శాతం రాయితీ అందిస్తోంది. ప్రయాణానికి రూ.100 ఖర్చవుతుంటే రూ.45 మాత్రమే ఛార్జి రూపంలో వసూలు చేస్తోంది. అంటే ప్రతి ప్రయాణికుడికి ఇది వరకే 55 శాతం రాయితీ ఇచ్చినట్లే కదా” అని సమాధానం ఇచ్చారు. కొవిడ్‌కు ముందు వృద్ధులకు, ప్రభుత్వ గుర్తింపు పొందిన జర్నలిస్టులకు రైలు టికెట్‌ ధరలో 50 శాతం రాయితీ వర్తించేది.ఈ అంశంపై లోక్‌సభ, రాజ్యసభల్లో పలువురు ఎంపీలు ప్రశ్నలు అడిగినప్పుడూ రైల్వే మంత్రి ఇదే తరహాలో సమాధానం ఇచ్చారు. మరోవైపు వృద్ధులకు రాయితీని రద్దు చేయడం ద్వారా 2022-23లో రైల్వే రూ.2,242 కోట్లు ఆర్జించినట్లు ఆర్‌టీఐ దరఖాస్తులో వెల్లడైంది.

➡️